తనను కట్టిన వాళ్లను జైలుకు పంపాలన్న రఘురామ పంతం నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చివరి దశకు తీసుకు వచ్చారు. రఘురామ ఇచ్చిన సాక్ష్యాలతో పాటు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా సహా… కొంత మంది పోలీసుల్ని అప్రూవర్లుగా మార్చడం ద్వారా మిగతా పని పూర్తి చేస్తున్నారు.
పుట్టిన రోజు నాడు హైదరాబాద్ ఇంట్లో ఉన్న సమయంలో సీఐడీ పోలీసులే సుమోటోగా కేసు పెట్టి మరీ అరెస్టు చేసి తీసుకెళ్లారు. హైదరాబాద్ లో అరెస్టు చేస్తే అక్కడి కోర్టులో ప్రవేశ పెట్టి ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలన్న కనీస రూల్ కూడా పాటించలేదు. నేరుగా సీఐడీ ఆపీసుకు తీసుకెళ్లి కొట్టారు. సీఐడీ సునీల్ స్వయంగా వచ్చి కొట్టినట్లుగా తేలింది. ఆ రోజున ఆయన ఫోన్ లొకేషన్ సహా … సీఐడీ ఆఫీసులో సెంట్రీ డ్యూటీలో ఉన్న వారి దగ్గర నుంచి వివరాలు తీసుకున్నారు. కొట్టిన సీఐడీ పోలీసుల వాంగ్మూలాలు తీసుకున్నారు.
అధికారం ఉందని… సైకో లక్షణాలున్న నేతను సంతృప్తి పరచడం కోసం ఇలా రాజకీయ నేతల్ని అరెస్టు చేసి కొట్టడమనే సంప్రదాయానికి.. తెరలేపిన సీఐడీ మాజీ చీఫ్ నిండా మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వీరి మాట విని తప్పుడు పనులు చేసిన గుంటూరు ఆస్పత్రి అప్పటి చీఫ్ కూడా జైలుకెళ్లనున్నారు. మొత్తంగా రఘురామ తనను కొట్టిన వారిని వదిలి పెట్టేదే లేదన్న పంతాన్ని నెరవేర్చుకుంటున్నారు.