తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందం ఖమ్మం, హైదరాబాద్‌లలో ఈ సోదాలు నిర్వహిస్తోంది. ఎన్నికలకు ముందు కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. పొంగులేటి బడా కాంట్రాక్టర్ . ఆయనకు రాఘవ గ్రూపు సంస్థలు ఉన్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వంలోనూ ఆయన భారీ కాంట్రాక్టులు చేపట్టారు.
ఇటీవల ఆయన కుమారుడు ఖరీదైన వాచ్‌లను హవాలా ద్వారా చెల్లించి కొనుగోలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేసినా హాజరు లేదు. నాలుగైదు కోట్లరూపాయలను బిట్ కాయిన్ల ద్వారా కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బహుశా ఈ విషయంలో వచ్చిన ఇన్ పుట్స్ మేరకు సోదాలు చేస్తున్నారేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా పదిహేను బృందాలు సోదాలు చేస్తూండటంతో… పెద్ద లొసుగు ఏదో కనిపెట్టి ఉంటారని అనుకుంటున్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ సర్కార్ లో కీలకమైన పొజిషన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి తర్వాత ఎక్కువ వ్యవహారాలు చక్క బెడుతోంది ఆయనే. ఈ క్రమంలో పొంగులేటిని ఈడీ టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఓ వైపు కర్ణాటకలో సిద్దరామయ్యకు చిక్కులు ఏర్పడ్డాయి. ఇక్కడ పొంగులేటిని టార్గెట్ చేయడంతో…. ఏదైనా రాజకీయం ఉందా అన్న చర్చ జరుగుతోంది.