ఇప్పుడు ఇల్లు కొనాలనుకునేవారు అప్పు చేయక తప్పదు. డబ్బులు కూడబెట్టి ఇల్లు కొనాలనుకుంటే రిటైర్మెంట్ ఏజ్కూ సాధ్యం కాదు. హోమ్ లోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత .. రుణ సామర్థ్యం కలిగిన యువత పెరిగిన తర్వాత … 90 శాతం మంది హోమ్ లోన్లు తీసుకుని ఇళ్లు కొనుక్కుంటున్నారు. అయితే ఇలాంటి వారిలో ఎక్కువ మంది హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు.
పైసా పైసా కూడబెట్టిన దానికి బ్యాంకు రుణం జత చేస్తే లకానీ ఇల్లు కొనలేరు. అలాంటప్పుడు ఆ ఇంటికి పూర్తి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటి కోసం రుణాన్ని తీసుకున్న ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాలు వంటిని సంభవించినప్పుడు ఆర్థికంగా నష్టపోకుండా… ఈ బీమా ఉపయోగపడుతుంది. అందుకే హోమ్ లోన్ ఇన్సూరెన్స్తో పాటు ఇంటికి ప్రతి ఒక్కరు బీమా చేయించాలని నిపుణుల ప్రధాన సూచన.
అయితే తీసుకున్న రుణంలో ఈ బీమాకు కనీసం ఒక శాతం వరకూ చెల్లించాల్సి వస్తుందన్న భావనతో చాల మంది వెనుకడుగు వేస్తున్నారు. కానీ కరోనా తర్వాత జీవితాలు మరింత అనిశ్చితంగా మారాయి. ఇాంటి సమయంలో హోమ్ లోన్ ఇన్సూరెన్స్ చాలా కీలకం. గృహ రుణం తీసుకున్న ఇంటి యజమాని చనిపోయినా, ప్రమాదంలో అంగవైకల్యం కలిగినా సదరు బీమా ద్వారా మిగిలిన లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తుంది. ఈ రిస్క్ తో పోలిస్తే ఒక్క శాతం కట్టడం పెద్ద సమస్యకాదు.
అలాగే ఇన్సూరెన్స్ మార్కెట్లో హోమ్ కంటెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంటుంది. ఇది హోమ్ లోన్ కు సంబంధం లేదు. ఇంట్లో ఉన్న సామగ్రి, ఉపకరణాలు, పరికరాలు పోయినా లేక దెబ్బతిన్నా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. ఆభరణాలతో పాటు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి ఉపకరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా వాటి మార్కెట్ ధరను బట్టి బీమా వర్తిస్తుంది. ఈ బీమా విషయంలో ఆలోచించవచ్చుకానీ.. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలన్న రూల్ పెట్టుకుంటే మంచిది.