రేపు ‘దేవర’ విడుదల అవుతోంది. ఈ అర్థరాత్రి నుంచి ప్రీమియర్లు మొదలవుతాయి. టాక్ ఏమిటన్నది తొలి ఆట పూర్తయ్యేంత వరకూ సస్పెన్సే. అయితే తమిళనాట ఇప్పటికే ఓ సినిమా టాక్ బయటకు వచ్చేసింది. అదే… ‘మెయాజ్హగన్’. అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించారు. ’96’లాంటి సూపర్ క్లాసిక్ అందించిన సి. ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగులో ‘సత్యం సుందరం’గా అనువదించారు. తెలుగులో శనివారం విడుదల చేస్తున్నారు. తమిళంలో ఇప్పటికే ప్రీమియర్లు పడిపోయాయి. అన్నిచోట్ల నుంచీ ‘సూపర్ హిట్’ టాక్ వస్తోంది. ఫీల్ గుడ్ మూమెంట్స్ తో కార్తి మెస్మరైజ్ చేశాడని, క్లైమాక్స్ గుండెల్ని బరువెక్కించిందని, ’96’లా గుర్తుండిపోయే సినిమాని దర్శకుడు అందించాడని తమిళనాట సినీ విశ్లేషకులు, అభిమానులు ముక్తకంఠంతో కితాబిస్తున్నారు. ప్రేమ్ కుమార్లో మణిరత్నం కనిపించాడని, తన టేకింగ్, ఎమోషన్స్ హ్యాండిల్ చేసే విధానం బాగున్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
కథని నమ్మి సినిమాలు తీసే వాళ్లలో కార్తి ముందు వరుసలో ఉంటాడు. ఈ కథని కార్తి గట్టిగా నమ్మాడు. అందుకే ‘ఖైదీ’, ‘సర్దార్’, ‘జపాన్’ ఇలా… వరుసగా మాస్ సినిమాలు తీసుకొంటున్న కార్తి, ఒక్కసారిగా రూటు మార్చి ఫీల్ గుడ్ ఎమోషన్ని ఎంచుకొన్నాడు. ఈ సినిమాకు ఈసారి అవార్డులు వెల్లువలా వస్తాయని, కార్తి ఖాతాలో చాలా అవార్డులు పడతాయన్నది విశ్లేషకుల అంచనా. సినిమా సూర్య, జ్యోతికలు కలిసి నిర్మించారు. హోం బ్యానర్లో చాలా పరిమిత బడ్జెట్ లో తీసిన సినిమా ఇది. తమిళనాట కొన్ని రోజుల పాటు ఈ సినిమా గురించి చర్చ జరగడం ఖాయం. మరి తెలుగులో రిజల్ట్ ఎలా ఉంటుందన్నది చూడాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా ‘దేవర’ మానియానే నడుస్తోంది. ఇలాంటి మాస్ సినిమా ముందు ఎంతటి ఫీల్ గుడ్ సినిమా అయినా నిలబడడం చాలా కష్టం. ఒక రోజు ఆలస్యంగా విడుదల అవ్వడం ‘సత్యం సుందరం’కు కాస్త ప్లస్ పాయింట్.