తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో కిందా మీదా పడిపోతున్న వైసీపీ నేతలు.. విచారణను ఎదుర్కోవడానికి భయపడిపోతున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు రాక ముందే పొన్నవోలును ఢిల్లీకి పంపి పిటిషన్ వేయించారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామితోనూ ఓ పిటిషన్ వేయించారు. ఓ హిందీ చానల్ ఎడిటర్ తోనూ మాట్లాడుకుని అదే పిటిషన్ వేయించారు. ఇదంతా వ్యూహాత్మకం. తమ వాదనకు బలం ఉందని అనిపించేలా ఒకే సారి వేయించారు . అందరిదీ ఒకటే డిమాండ్ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని .
ఎవరైనా దర్యాప్తు అడుగుతారు… పోలీసులు, సీబీఐ, సీఐడీ అలా అనేక దర్యాప్తు సంస్థలు ఉంటాయి. కానీ నేరుగా కోర్టు పర్యవేక్షణలో తమ కేసు విచారణ జరగాలని పిటిషన్లు వేయడం అసాధారణం. దొరికిపోతామన్న భయంతో కోర్టు పర్యవేక్షణలో జరిగితే కోర్టులకు సమయం ఉండదు కాబట్టి కోల్డ్ స్టోరేజీలో పెట్టేస్తారన్న నమ్మకంతో ఇలాంటి పిటిషన్లు వేస్తారు. లడ్డూ విషయంలో చంద్రబాబు సిట్ వేయాలని నిర్ణయించారు. ఐజీ స్థాయి అధికారితో సిట్ వేయాలని నిర్ణయించారు. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా కల్తీని తేల్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందో లేదో కానీ.. తాము బయటపడాలంటే.. సీబీఐ అయినా సరే సాధ్యం కాదని… కోర్టు పర్యవేక్షణ విచారణ కావాలని పిటిషన్లు వేస్తున్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ అనేది రాజకీయ నాయకులు చేసే కామన్ డిమాండ్. అది అసాధ్యమని వారికి తెలుసు. అందుకే ప్రకటనలు చేస్తూంటారు. పోలీసులు చేయాల్సిన పనిని న్యాయమూర్తులకు ఇవ్వరు. అందుకే ఇప్పుడు రిటైర్ అయిన జడ్జి అయినా ఓకే అని.. వైసీపీ నేతలు..వారి స్పాన్సరర్లు పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు ఎలా స్పందిస్తుందో కానీ… దర్యాప్తు సంస్థలు చేసే విచారమలో అసలు విషయాలు బయటపడతాయని.. జగన్ రెడ్డి అండ్ కో మాత్రం వణికిపోతున్నారు. వారు కోరుకున్నట్లు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగినా వాస్తవాలను మరుగునపర్చలేరుగా… కాస్త ఆలస్యం చేయగలరంతే.