‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ వేడుకలో కార్తి వేసిన సెటైర్ ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది. ‘లడ్డూ గురించి ఇప్పుడొద్దు.. చాలా సెన్సిటీవ్ మేటర్ ఇది’ అంటూ తిరుమల లడ్డూ గురించి పరోక్షంగా కార్తి సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. సెన్సిటీవ్ విషయాలపై జోకులు వద్దని, హైందవ సంప్రదాయాలకు భంగం కలిగినప్పుడు సంఘీభావం ప్రకటించాలని, లేదంటే ఖాళీగా కూర్చోవాలని, ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు పలికారు. దీనిపై కార్తి కూడా వెంటనే స్పందించారు. సోషల్ మీడియా మాధ్యమం X వేదికగా పవన్ కి సారీ చెప్పారు. ”ప్రియమైన పవన్ కల్యాణ్ సార్.. నా మాటలు వలన ఊహించని పరిణామం ఏర్పడింది. అపార్థాలు చోటు చేసుకున్నాయి. నేను క్షమాపణ కోరుతున్నాను. నేను కూడా వేంకటేశ్వర స్వామి భక్తుడినే. ఎప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను”. అని కార్తీ ట్వీట్ చేశారు. ఇంత సున్నితమైన విషయాన్ని కార్తీ అంతే హుందాగా డీల్ చేసిన విధానం అభిమానుల్ని ఆకట్టుకొంటోంది.
ప్రకాష్ రాజ్ పై కూడా పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. హిందూమతంపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ నేరుగా ప్రకాష్ రాజ్ ని నిలదీశారు. నటుడిగా ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవం ఉందని, కానీ.. తన వ్యాఖ్యలు మాత్రం సమర్థించలేనని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కార్తిలా ప్రకాష్ రాజ్ కూడా ఈ విషయాన్ని సున్నితంగానే డీల్ చేస్తారా, లేదంటే మరింత రచ్చ చేస్తారా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.