కార్తీ ఏమన్నాడని.. పవన్ కల్యాణ్ అంత సీరియస్ అయ్యాడు ?. దుర్గ గుడిలో ప్రాయశ్చిత్త దీక్ష లో భాగంగా దుర్గమ్మ ఆలయ మెట్లు కడిగిన తరవాత పవన్ కల్యాణ్ చేసిన విమర్శల్లో కార్తీ ప్రస్తావన వచ్చింది. నేరుగా కాకపోయినా పరోక్షంగా కార్తీని విమర్శించారు. “ఓ సినిమా ఫంక్షన్లో లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అంటున్నారు. మళ్లీ ఇంకోసారి అలా అనొద్దు. దయచేసి సనాతన ధర్మాన్ని పాటించండి ” అని పవన్ స్పందించారు. వెంటనే కార్తీ స్పందించారు. క్షమాపణలు చెప్పారు. ఎలాంటి భేషజాలు పెట్టుకోలేదు.
కానీ కార్తీ లడ్డూ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఎవరికీ అభ్యంతరకరంగా అనిపించడం లేదు. సత్యం సుందరం ట్రైలర్లో భోజనాల బిట్లో లడ్డూ గురించి ప్రస్తావన ఉంది. దాన్ని యాంకర్ ప్రస్తావించారు. ప్రస్తుతం అది సెన్సిటివ్ టాపిక్ కాబట్టి అలా మాట్లాడారు. కార్తీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ .. పొరపాటున ఏదైనా మాట్లాడిన పెద్ద వివాదం అయ్యేదని ఊహించకోవచ్చని ఈ టాపిక్ గురించి తెలిసిన వాళ్ల అభిప్రాయం. కానీ పవన్ కల్యాణ్ అది తిరుమల లడ్డూ గురించి అనుకున్నారు.
పవన్ కల్యాణ్ ఆ వీడియోలు చూడకపోవచ్చు. ఆయనకు ఇలా లడ్డూపై స్పందించిన వారు.. ప్రకాష్ రాజ్.. లాయర్ పొన్నవోలు వంటి వారు మాట్లాడిన మాటల గురించి చెప్పి ఉంటారు. అదే పద్దతిలో కార్తీ లడ్డూ టాపిక్ ను రిపోర్ట్ చేసి ఉంటారని అందుకే ఆయన అలా స్పందించారని అంటున్నారు. కార్తీ ఈ విషయంలో పవన్ మిస్ అండస్టాండింగ్ చేసుకున్నారని తెలిసినా వెంటనే.. హంబుల్ గా స్పందించారు. కార్తీకి ఇండస్ట్రీలో ఎవర్నీ నొప్పించని వ్యక్తిగా పేరుంది. అందుకే ఆయనకు ఈ విషయంలో సానుభూతి లభిస్తోంది.