Sathyam Sundaram Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్-
జీవితమంటే ఆస్తులు, అప్పులు కాదు. అనుబంధాలు, ఆత్మీయతలు. కొన్ని కృతజ్ఞతలు. ఇంకొన్ని క్షమాపణలు. ఒకరు చేసిన చిన్నపాటి సాయమైనా జీవితాంతం గుర్తుపెట్టుకొని కృతజ్ఞత చెప్పుకోవడం ఎంత అవసరమో, ఎంత పెద్ద తప్పునైనా పెద్ద మనసుతో క్షమించేసి, ఎవరి జీవితాల్లో వాళ్లు మూవ్ ఆన్ అవ్వడం కూడా అంతే గొప్ప విషయం. ‘సత్యం సుందరం’ కథకీ, అందులోని పాత్రల వైఖరికీ, ఈ సినిమాతో దర్శకుడు చెప్పదలచుకొన్న విషయానికీ.. ఈ రెండు విషయాలే మూలం. ’96’తో తనలోని క్లాస్ టచ్ ఎలాంటిదో చూపించాడు ప్రేమ్ కుమార్. ఇప్పుడు అదే దర్శకుడు కార్తి, అరవింద్ స్వామిలతో బ్రొమాన్స్ నడిపాడు. ఈ కథలోనూ ’96’లాంటి టచ్ ఉంది. కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. గుండెబరువెక్కించే సన్నివేశాలు ఉన్నాయి. కథలో ఔన్నత్యం, పాత్రల మధ్య ఔచిత్యం కనిపిస్తాయి. మరి వీటి మేళవింపు ఎలా వుంది? ఇంతకీ ప్రేమ్ కుమార్ ఎలాంటి కథ చెప్పాలనుకొన్నాడు?
సత్యం (అరవింద్ స్వామి)కు తన ఇల్లంటే ప్రాణం. అదో ఎమోషన్. అయితే ఇరవై ఏళ్ల వయసు ఉన్నప్పుడు బంధువులు చేసిన ద్రోహం వల్ల తమ సొంత ఇంటినీ, ఊరినీ, బంధువుల్నీ వదిలేసి వైజాగ్ వచ్చేస్తాడు. ఇంకెప్పుడూ తన సొంత ఊరు వెళ్లకూడదని నిర్ణయించుకొంటాడు. అయితే ఇరవై ఏళ్ల తరవాత ఓ పెళ్లి కోసం బలవంతంగా ఆ ఊరికి వెళ్లాల్సివస్తుంది. వీలైనంత త్వరగా ఆ ఊరి నుంచి బయటపడాలన్నది సత్యం ఆలోచన. అయితే ఆ పెళ్లిలో ఓ వ్యక్తి (కార్తి) కలుస్తాడుఉ. ‘బావా.. బావా’ అంటూ ఎంతో ప్రేమగా పలకరిస్తాడు. అనుక్షణం ఆప్యాయత ఒలకబోస్తుంటాడు. అసలు ఆ వ్యక్తి తనకు ఏమవుతాడో, తమిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం ఉందో కూడా సత్యంకు అర్థం కాదు. అది తెలుసుకొనే ప్రయత్నంలో విఫలం అవుతుంటాడు.ఆ రోజు రాత్రి సత్యం, ఆ అపరిచిత బంధువు మధ్య జరిగిన సంఘటనలు, వారిద్దరి మధ్య వచ్చే సంఘర్షణ.. ఇదే స్థూలంగా ‘సత్యం సుందరం’ కథ.
ఇలాంటి కథల్ని కూడా సినిమాగా తీయొచ్చా? అనిపించేంత చిన్న లైన్ ఈ కథ. అయితే.. ఇలాంటిచోటే దర్శకుడి ప్రతిభాపాటవాలు బయటపడుతుంటాయి. కథ చిన్నదే కావొచ్చు. కానీ అందులో దర్శకుడు బలమైన భావోద్వేగాల్ని అత్యంత సహజంగా మేళవించి ఆవిష్కరించినప్పుడు ఆ చిన్న కథే.. ఆకాశమంత ఎదుగుతుంది. ‘సత్యం సుందరం’ అలాంటి కథే. సత్యం తన ఇంటికి వదిలి వెళ్లిపోయే సన్నివేశం నుంచి ఈ కథ మొదలవుతుంది. ఆ సన్నివేశం చాలా సుదీర్ఘంగా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్ని ఎంత త్వరగా ‘కట్’ చేస్తే అంత మంచిది. కానీ కొన్ని సన్నివేశాల్లో ఉండే గాఢత, లోతు అర్థం అవ్వాలంటే వీలైనంత విస్త్రతంగానే చెప్పాలి. ప్రేమ్ కుమార్ తాను నమ్మిన భావోద్వేగాలు ప్రభావవంతంగా రావడమే లక్ష్యంగా పెట్టుకొన్నాడు. అందుకే ఎక్కడా లెంగ్త్ గురించి ఆలోచించలేదు. తొలి సీన్లో.. సత్యంకు తన ఇల్లంటే ఎంతిష్టమో బలంగా చెప్పాలి. అందుకే.. అంత టైమ్ తీసుకొన్నాడు. ఆ తరవాత కథకు కీలకమైన ప్రతీ చోటా.. లెంగ్త్ అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. పెళ్లి వేడుకలో చెల్లాయికి పట్టీలు తొడిగే సీన్ ఒకటుంది. దాదాపు 5 నిమిషాల సీన్ అది. ఆ సన్నివేశం మొదలైన తరవాత కాసేపటికి ‘ఏమిటి దర్శకుడికి ఇంత చాదస్తం’ అనిపిస్తుంది. కానీ.. చివర్లో అరవింద్ స్వామి కంట్లోంచి ఓ కన్నీటి చుక్క చెల్లాయి పాదంపై రాలినప్పుడు… ‘ఇది కదా ఎమోషన్’ అనిపిస్తుంది. ప్రతీ అన్న, ప్రతీ చెల్లాయీ ఫీల్ అవ్వాల్సిన సీన్ అది. బలమైన భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్లో నాటుకు పోయేలా చేయాలనుకొన్నప్పుడు లెంగ్త్ గురించి పట్టించుకోకపోయినా ఫర్వాలేదని చాటి చెప్పే సీన్ అది.
కార్తి పాత్ర ఎంటరైనతరవాత కాస్త ఫన్ తోడవుతుంది. తన కేరింగ్లో, ప్రేమలో, అమాయత్వంలో అన్ని చోట్లా.. సున్నితమైన వినోదం పండుతూనే ఉంటుంది. సాధారణంగా తమిళ చిత్రాల్లో ఓవర్ ది బోర్డ్ కామెడీ ఉంటుంది. అది ఈ సినిమాలో మచ్చుకైనా కనిపించదు. ఉదాహరణకు ‘తాటి బెల్లం టీ’ సీన్. అక్కడ రాసింది చిన్న డైలాగే. ఇచ్చింది చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లే. కానీ థియేటర్లో నవ్వులు పూస్తాయి. ఇలాంటి అవకాశాల్ని దర్శకుడు బాగా వాడుకొన్నాడు. కొన్ని సందర్భాల్లో సెట్యువేషన్ వల్ల వినోదం పండితే, ఇంకొన్ని చోట్ల కార్తి అమాయకత్వం, తన ఈజ్ తో.. ఫన్ వచ్చింది.
కృతజ్ఞత ఎంత గొప్పదో సైకిల్ సీన్ చెబుతుంది. చిన్న చిన్న సాయాలే కొంతమంది జీవితాల్ని పూర్తిగా మార్చేస్తాయి అనడానికి అదో ఉదాహరణ. ఆ సన్నివేశంలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది. మనకు తెలియకుండానే రెట్రో ఫీలింగ్ వచ్చేస్తుంది. అరవింద్ స్వామి సైకిల్ తొక్కుతూ, ఆ వీధుల్లో దూసుకుపోతున్నప్పుడు అతని మొహంలో స్వచ్ఛమైన ఆనందాన్ని దర్శకుడు బాగా క్యాప్చర్ చేయగలిగాడు. ‘పేరు పెట్టి మరీ దీవించాలి’ అన్నప్పుడు సత్యం పాత్ర పడే స్ట్రగుల్, అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం ఇవన్నీ బాగా చూపించాడు.
అయితే క్లైమాక్స్ ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రేక్షకుడు ఇంతకు మించిన డోస్ ఏదో ఆశిస్తాడు. కానీ అది దొరకదు. బుల్ కి సంబంధించిన ఎపిసోడ్ కూడా కథలో ఇరికించినట్టు అనిపిస్తుంది. దాని వల్ల.. కథలో కొత్త మలుపులేం రావు. ప్రతీ సన్నివేశాన్నీ చాలా జాగ్రత్తగా విడమరచి చెప్పాలనుకొనే ప్రయత్నం కొన్నిసార్లు బోర్ కొట్టిస్తుంది. కథ ఎక్కువగా కార్తి, అరవింద్ స్వామి మధ్యే తిరుగుతుంటుంది. వీరిద్దర్ని మినహాయిస్తే ఏ పాత్రా గుర్తుండదు. ఒకే థ్రెడ్ మీద కథ సాగుతున్నప్పుడు రిపీట్ ఎమోషన్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలోనూ ఆ లోపం ఉంది. కమల్ హాసన్ – మాధవన్ కలిసి చేసిన ‘సత్యమే శివం’.. అందులోని పాత్రలూ ఈ సినిమా చూస్తున్నప్పుడు గుర్తొస్తుంటాయి. ఈ కథలో కార్తి పాత్రకూ ‘సత్యమే శివం’లోని కమల్ పాత్రకూ సారుప్యత కనిపిస్తుంది. రెండు సినిమాల టైటిళ్లూ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి.
కార్తి మంచి నటుడు. కథలకు ప్రాధాన్యత ఇచ్చే హీరో. కథని నమ్మే ఈ సినిమా చేశాడు. కార్తి తన సహజమైన నటనతో చాలా సన్నివేశాల్ని నిలబెట్టాడు. ట్రైలర్ చూస్తున్నప్పుడు కార్తి వన్ మాన్ షో చూడబోతున్నామన్న ఫీలింగ్ వచ్చింది. అయితే అరవింద్ స్వామి సర్ప్రైజింగ్ గా.. కార్తికి పోటీ వచ్చాడు. అరవింద్ స్వామి కెరీర్లోని మంచి పాత్రల్లో ఇదొకటిగా మిగిలిపోతుంది. ఆ పాత్రలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని చాలా అందంగా ప్రకటించగలిగాడు. ఇంత సింపుల్ కథని చాలా ప్రభావవంతంగా తీర్చిదిద్దగలిగాడు ప్రేమ్ కుమార్. ’96’లోని మ్యాజిక్ ఈ సినిమాతోనూ రిపీట్ చేయగలిగాడు. పాటలు కథలో కలిసిపోయాయి. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం కూల్ గా ఉన్నాయి. కంటితడి పెట్టించే ఎమోషన్స్.. కదిలించే సన్నివేశాలు, హాయిగా నవ్వుకొనే సందర్భాలు కలగలిపి ఓ అందమైన జ్ఞాపకంగా ఈ సినిమాని మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కార్తి ప్రయత్నాన్ని, దర్శకుడి ఆలోచనని అభినందించాల్సిందే.