నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి నటిస్తున్నారా? ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారా? ఈ కాంబినేషన్‌ని కలిపి చదువుతుంటేనే అద్భుతంగా అనిపిస్తోంది. ఇక తెరపైకి తీసుకొస్తే ఇంకేమైనా ఉందా? సంచలనాలే. బాక్సాఫీసు దిమ్మతిరిగిపోవడం ఖాయం. రాజమౌళి అనుకొంటే కానిది లేదు. ఆయనతో జట్టు కట్టడానికి టాలీవుడ్ మొత్తం సై అంటుంది. బాలయ్య, మహేష్ కూడా రెడీ అనేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందన్న వార్త బయటకు రాగానే.. అద్భుతం అన్నారేగానీ, అసాధ్యం అన్న ఊహే రాలేదు. అయితే… ఇదంతా ఒట్టి పుకారే అని తేలింది.
”బాలయ్య తన వందో సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళితో సినిమా ప్రస్తావనే రాలేదు. అలాంటిది మల్టీస్టారర్ వరకూ ఈ కథ ఎలా వెళ్లిపోతుంది?” అని బాలయ్య కాంపౌండ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మహేష్‌బాబు సన్నిహితులదీ అదే మాట. ”రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుంది. కానీ అది మల్టీస్టారర్ కాదు” అని మహేష్ సన్నిహితులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. సో.. ఇదంతా ఒట్టి పుకారే అన్నమాటే. పుకారే అయినా.. ఆ కాంబినేషన్ ఎంత బాగుంటుందో? ఈ పుకారే నిజమైతే… ఇక అద్భుతాల వెల్లువే.