దళిత మేధావి అని టీడీపీ అధినేత చాన్స్ ఇస్తే సద్వినియోగం చేసుకుని తనదైన ముద్ర వేయాల్సిన కొలికపూడి శ్రీనివాసరావు అందరితో వివాదాలు పెట్టుకుని సమస్యగా మారుతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ చాలా ఏళ్ల తర్వాత గెలిచింది. సొంత నియోజకవర్గం కాకపోయినా అమరావతి కోసం పోరాడిన నేతగా కొలికపూడికి పేరు ఉంది. అందుకే చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. గాలిలో గెలిచేశారు.
అయితే అసలు సమస్య ఆయన గెలిచిన తర్వాతనే వచ్చింది. ఎమ్మెల్యేగా ఎలా ఉండాలో అలా ఉండకుండా ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముందూ వెనుకా చూసుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఆయనపై ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గ టీడీపీ నేతల్లో ఆయనపై చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా మీడియా ప్రతినిధులు కూడా అదే మాట ఫిర్యాదు చేశారు. ఆయన కారణంగా ఒక టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం చేశారన్న ప్రచారమూ జరిగింది.
ఒకరిద్దరు ఆయనను వ్యతిరేకిస్తే.. తప్పు ఆ ఒకరిద్దరి వైపే ఉందనుకోవచ్చు కానీ.. దాదాపుగా అందరూ వ్యతిరేకిస్తే మాత్రం కొలికపూడి వేరే దారిలో వెళ్తున్నట్లే అని టీడీపీ పెద్దలు కూడా భావిస్తున్నారు. మొదట్లో ఆయన ఓ ఇంటిని స్వయంగా కూల్చి వేయించడంతో పాటు.. రకరకాల వివాదాల్లో వేలు పెట్టారు. గెలిచిన మూడు నెలలు కాకుండానే ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటే కష్టమని టీడీపీ పెద్దలు కూడా సంకేతాలు పంపుతున్నారు. కానీ కొలికపూడి మాత్రం.. బెదిరింపు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.