తుని విధ్వంసం కేసులో అరెస్టయిన 13 మందిని పోలీసులు విడిచిపెట్టడంతో ముద్రగడ పద్మనాభం దంపతులు నిరాహార దీక్ష విరమించడానికి అంగీకరించారని వైద్యులు నిన్న సాయంత్రం మీడియాకి చెప్పారు. ముద్రగడ కిర్లంపూడిలో తన నివాసంలో, ఆయన భార్య రాజమండ్రి ఆసుపత్రిలో దీక్ష విరమించబోతున్నట్లు చెప్పారు. వారినిరువురినీ మరికొద్ది సేపటిలో పోలీసులు కిర్లంపూడి తరలిస్తారని వైద్యులు చెప్పారు. కానీ ఆ తరువాత నుండి మళ్ళీ నాటకీయ పరిణామాలు జరిగాయి. జైలు నుంచి విడుదలయిన ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వాసిరెడ్డి ఏసుదాసు ముద్రగడని కలిసేందుకు ఆసుపత్రికి చేరుకోగా వారిని పోలీసులు అడ్డగించారు. తాము ఆయన చేత దీక్ష విరమింపజేయడానికే వచ్చామని చెప్పినా పోలీసులు వారిని లోనికి అనుమతించలేదు.
మొదట దీక్ష విరమిస్తానని చెప్పిన ముద్రగడ, జైలు నుంచి విడుదలైన 13 మందిని ప్రభుత్వం తన ముందు హాజరుపరిస్తే తప్ప దీక్ష విరమించేది లేదని చెప్పి మళ్ళీ తన నిరాహార దీక్షని కొనసాగించడం మొదలుపెట్టారు. ముద్రగడ తీరుతో విసుగెత్తిపోయిన ప్రభుత్వం కూడా బిగుసుకుపోయింది. ఆయన కోరినవన్నీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన కోరినట్లుగా 13 మందిని విడుదల చేశాము కనుక ఇక ఆయన ఆసుపత్రి నుంచి వెళ్లిపోవచ్చని ఎవరూ ఆయనని అడ్డుకోబోరని తేల్చి చెప్పింది. కానీ ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయనతోబాటు ఆయన భార్య పద్మావతి కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. రాజమండ్రి రూరల్ భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మరి కొందరు కాపు నేతలు ఆయనకి నచ్చజెప్పేందుకు చాలాసేపు ప్రయత్నించారు కానీ ఆయన పట్టువీడలేదు.
ముద్రగడ కోరినట్లుగా తుని కేసులో అరెస్టయిన వారినందరినీ ప్రభుత్వం విడిచిపెట్టిందని కాపు నేతలే స్వయంగా చెపుతున్నా ఆయన ఇంకా చిన్న పిల్లాడిలా మంకు పట్టు పట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వమే తమని కిర్లంపూడికి చేర్చాలనే మరో కొత్త డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది మరీ హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే ఆయన ఈ దీక్ష కారణంగా చాలా చులకన అయిన సంగతి గ్రహించకుండా, ఇంకా ఇటువంటి డిమాండ్లతో దీక్ష కొనసాగించితే చివరికి ఆయనే నలుగురిలో నవ్వులపాలవుతారు. ఈ సంగతి ప్రభుత్వం కూడా గ్రహించింది గాబట్టే ఈవిధంగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది.
ఆయన పట్ల ప్రభుత్వం చాలా కటినంగా వ్యవహరిస్తునట్లు స్పష్టంగా కనబడుతోంది. ఆ కారణంగా కాపులు తెదేపాకి దూరం అవుతారా లేదా? ఒకవేళ అయితే అపుడు తెదేపా ఏమి చేస్తుందనే విషయం ఆలోచించుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. అలాగే ఇకపై ప్రభుత్వంతో ఏవిధంగా వ్యవహరించాలో ఆలోచించుకొనేందుకు ముద్రగడ పద్మనాభానికి చాలా సమయం ఉంది. కనుక తక్షణమే దీక్ష విరమిస్తే ఆయనకే గౌరవంగా ఉంటుంది. లేకుంటే ఊహించని పరిణామాలు ఏవో జరిగితే ఆయనే నవ్వులపాలయ్యే అవకాశం ఉంది.