ఇన్నాళ్లూ గ్లామర్ ని నమ్ముకొన్న కథానాయికలు తమలోని నటిని ఆవిష్కరించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు పాటలూ, రెండు రొమాంటిక్ సీన్లూ అనే పద్ధతిని పక్కన పెట్టి, తమలోని తెగువని చూపించే సాహసం చేస్తున్నారు. అలియాభట్ నటించిన `జిగ్రా` ట్రైలర్ చూస్తే తను కూడా అలాంటి అడుగే వేసినట్టు స్పష్టం అవుతుంది. వసన్ బాలన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. అక్టోబరు 11న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
చేయని తప్పుకి విదేశాల్లో పోలీసులకు దొరికిపోతాడు తమ్ముడు. జైల్లో చిత్రహింసలు అనుభవిస్తుంటాడు. తమ్ముడంటే విపరీతమైన ప్రేమ, కేరింగ్ ఉన్న అక్క.. అప్పుడు ఏం చేసిందన్నదే కథ. తనలోని యాక్షన్ విన్యాసాన్ని చూపించే పాత్ర లో అలియా నటించింది. ఆమె పాత్ర చుట్టూ చాలా కోణాలు, భిన్న భావోద్వేగాలూ కనిపిస్తాయి. లాజిక్, ధైర్యం, మొండితనం.. అన్నింటికంటే ముఖ్యంగా తమ్ముడిపై విపరీతమైన ప్రేమ.. ఇవన్నీ ఈ పాత్రలో మేళవించారు దర్శకుడు. కరణ్ జోహార్ ఈ చిత్రానికి నిర్మాత. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ విడుదల చేస్తున్నారు. `దేవర` ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లినప్పుడు అక్కడ కరణ్, అలియాలతో ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా జిగ్రా విషయాలూ పంచుకొంది దీపిక. త్వరలోనే `జిగ్రా` ప్రమోషన్ల కోసం అలియా కూడా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది.