హైడ్రా కూల్చివేతలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. పెద్దోళ్ల జోలికి వెళ్ళకుండా పేదల నివాసాలను మాత్రమే కూల్చివేస్తున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల హైడ్రా కూల్చివేతలపై నిరసనలు వ్యక్తం అవుతుండగా.. మూసీ సుందరరీకరణ కోసం మరికొన్ని ఇండ్లను కూల్చివేయడంతో హైడ్రా రచ్చ పతాక స్థాయికి చేరుకుంది.
ఈ క్రమంలోనే మూసీ పరిధిలో కూల్చివేతలతో నిరాశ్రయులు అయిన బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ యాత్ర చేపట్టింది. గోదావరి నీళ్ళేమోకానీ ప్రజల రక్తం పారుతున్నది అంటూ హరీష్ రావు హైడ్రా కూల్చివేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతలు రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయని…కూల్చివేతలపై వెనక్కి తగ్గాలని అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు..హైడ్రా కూల్చివేతలు కొంతమందికి తీవ్ర నష్టం చేసేలా ఉన్నా..భవిష్యత్ లో నగర అభివృద్ధికి ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ శ్రేణులు హైడ్రా కూల్చివేతలను సమర్ధిస్తున్నాయి.
కాగా..ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ళను కూల్చడం సరికాదన్నారు. స్లమ్ ల జోలికి వెళ్ళవద్దని ముందే చెప్పానని వ్యాఖ్యానించారు. పేదల ఇళ్ళను కూల్చడం సరికాదు.. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయించి ఆ తర్వాత ఖాళీ చేయించాల్సిందన్నారు.
ఎప్పుడో నిర్ణయించిన బఫర్ జోన్ , ఎఫ్ టీఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదు.. ఇళ్లకు రెడ్ మార్క్ వేయడం తొందరపాటు చర్యేనని దానం వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది.