వరుస ఎన్నికల ఓటములతో తేరుకొని బీఆర్ఎస్ తిరిగి ఫామ్ లోకి వస్తుంటే… ఈ రెండు ఎన్నికల్లో అంచనాలను మించి ఫలితాలను సాధించిన బీజేపీ మాత్రం దూకుడును కొనసాగించలేకపోతోంది. రాజకీయం చేసేందుకు అవకాశం కళ్లముందు కనిపిస్తున్నా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో బీజేపీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అనేది చర్చనీయాంశం అవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి..ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో డిపాజిట్ గల్లంతు కావడంతో బీఆర్ఎస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కారు పంక్చర్ అయిందని, ఇప్పట్లో కారు పరుగులు పెట్టడం సాధ్యం కాదని నేతలు కారు దిగి కాంగ్రెస్, కమలం తీర్ధం పుచ్చుకున్నారు.
అసలే వరుస ఓటములు… ఆపై అధినేత ఫామ్ హౌజ్ కే పరిమితం కావడంతో గులాబీ శ్రేణులు మానసిక స్థైర్యాన్ని కోల్పోయాయి. పార్టీ ఫిరాయింపు విషయంలో హైకోర్టు ఆదేశాలు.. ఆ సమయంలోనే పీఏసీ చైర్మన్ గా అరికెపూడి గాంధీని నియమించడంతో బీఆర్ఎస్ ఉద్యమ సమయం నాటి రాజకీయం చేయాలని సంకల్పించింది. కానీ, పాడి కౌశిక్ రెడ్డి నోటిదూలతో ఆ వ్యూహం కూడా బెడిసికొట్టింది.
వరదల బారి నుంచి హైదరాబాద్ ను కాపాడేందుకు , ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై ఎలా స్పందించాలో తెలియక బీఆర్ఎస్ మొదట్లో తెగ గింజుకుంది. మూసీ సుందరీకరణలో భాగంగా పేదల నివాసాలను హైడ్రా అధికారులు తాజాగా కూల్చివేయడం… ఓ మహిళా తమ ఇంటిని కూడా కూల్చివేస్తారేమోనని ఆత్మహత్య చేసుకోవడంతో హైడ్రా రచ్చ పీక్స్ స్టేజ్ కు చేరుకుంది. దీంతో హైడ్రా పేరుతో బీఆర్ఎస్ బలమైన స్వరం వినిపిస్తున్నా…గ్రేటర్ లో గణనీయమైన కార్పొరేటర్లు ఉన్న బీజేపీ మాత్రం అగ్రెసివ్ గా స్పందించకపోవడం పట్ల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఈ విషయంలో ఎలా స్పందించినా.. బీజేపీకి ఆదరణ పెరిగితే అది కిషన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తుంది. ఇప్పటికే బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సర్కార్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టినా… అది కిషన్ రెడ్డి డైరక్షన్ లోనే సాగుతున్నాయని జాతీయ నాయకత్వం భావిస్తోందని… అందుకే సీనియర్ నేతలు ఎవరూ అడపాదడపా స్పందించడం మినహా అగ్రెసివ్ రోల్ పోషించడం లేదనే టాక్ నడుస్తోంది.
ఏదీ ఏమైనా.. హైడ్రా పేరుతో బీఆర్ఎస్ ఫామ్ లోకి వస్తుంటే… అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ధీటుగా సత్తా చాటిన బీజేపీ మాత్రం ఆ దూకుడును కొనసాగించలేకపోతోంది.