ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 26న చైనాకి బయలుదేరుతున్నారు. ఆయనతోబాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఏడుగురు ఉన్నతాధికారులు, ఇతరులు ముగ్గురు చైనా వెళుతున్నారు. నాలుగు రోజుల పాటు సాగే వారి పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, రాజధాని నిర్మాణం కోసం చైనా సంస్థల సహాయ సహకారాలను పొందడం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలియజేసింది.
గత ఏడాది కూడా చంద్రబాబు నాయుడు బృందం ఇదే పనిపై చైనాలో పర్యటించింది కానీ దాని వలన ఎటువంటి ఫలితం కనబడలేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మళ్ళీ పట్టువదలని విక్రమార్కుడు లాగ మరోసారి చైనా బయలుదేరుతున్నారు. ఈసారైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయో లేదో చూడాలి.
జూన్ 27నుంచి అమరావతి నుంచే పరిపాలన సాగిస్తామని ముఖ్యమంత్రి పదేపదే చెప్పినప్పుడు, అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకి తరలింపు, ఉద్యోగుల బదిలీలు వంటి అనేక కార్యక్రమాలు ప్రస్తుతం చాలా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి తరువాత తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులని మంత్రి నారాయణ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి కీలక సమయంలో ఆ పనులని పర్యవేక్షిస్తున్న మంత్రుల్ని, అధికారులని వెంటబెట్టుకొని ముఖ్యమంత్రి చైనా పర్యటనకి బయలుదేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పనులన్నీ ఆశించిన విధంగా వేగంగా జరగడం లేదనే అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, చైనా వెళ్లి పెట్టుబడులు, రాజధాని నిర్మాణం కోసం చైనా సంస్థల సహాయ సహకారాలను పొందలేకపోతే ఇంకా అసంతృప్తికి గురవవచ్చు. ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. తాత్కాలిక సచివాలయం నిర్మాణం పూర్తి చేసుకొని, హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులను అక్కడికి తరలించి పరిపాలనను గాడిలో పెట్టిన తరువాత ముఖ్యమంత్రి ఏ దేశం వెళ్ళినా ఎవరూ ఆక్షేపించేవారు కాదు.