హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాకు చెందిన 25,000మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించారు. గోకుల్ బరాజ్ అనే ఆనకట్టను నిర్మించటంతో ముంపుకు గురైన తమ 700 ఎకరాలకు నష్టపరిహారంకోసం 17 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నా ఫలితంలేకపోవటంతో తామీ పనికి పూనుకున్నట్లు వారు చెబుతున్నారు. మొత్తం 11 గ్రామాలకు చెందిన ఈ రైతులు 1998నుంచి దీనిపై ఆందోళన చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో పోలీస్ బుల్లెట్లనుకూడా ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ధర్నాకు దిగినపుడు, ఒక్క నెలలో ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తామని అధికారులు వాగ్దానం చేశారని, కానీ అది ఆచరణకాలేదని రైతులు చెబుతున్నారు. స్వాతంత్ర్యదినోత్సవంసందర్భంగా ఈ ఆగస్ట్ 15న ఆత్మహత్య చేసుకోవటానికి అనుమతించాలని రాష్ట్రపతిని కోరుతున్నారు.
మరోవైపు, ఇదేరకమైన డిమాండ్‌తో గ్వాలియర్ జైలులో ఖైదీలుగా ఉన్న 70మంది వ్యాపమ్ కుంభకోణ నిందితులుకూడా రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నారు. న్యాయపరంగా తాము అసమానతలకు గురవుతున్నామని వారి ఆరోపణ.