ముద్రగడ దంపతులు కొద్ది సేపటి క్రితమే రాజమండ్రి ఆసుపత్రి నుంచి తమ స్వగ్రామం కిర్లంపూడికి బయలుదేరారు.
వారు తమ నిరాహారదీక్ష విరమించగానే సాక్షి ప్రసారాలను పునరుద్దరిస్తామని ఏపి రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం నేటి నుంచి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో సాక్షి న్యూస్ ఛానల్ ప్రసారాలు పునరుద్దరించారు.
దీనిపై హైకోర్టులో నిన్న విచారణ జరిగినప్పుడు ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది సాక్షి ప్రసారాలు నిలిపివేయమని ప్రభుత్వం, కలెక్టర్లు, పోలీసులు అధికారులు ఎం.ఎస్.ఓ.లని కోరలేదని చెప్పారు. అదే విషయాన్ని లిఖితపూర్వకంగా అఫిడవిట్ ద్వారా సమర్పించమని న్యాయమూర్తి కోరడంతో ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులలో పడింది. బహుశః అందుకే రెండు జిల్లాలలో సాక్షి ప్రసారాలు మళ్ళీ పునరుద్దరించి ఉండవచ్చు.
కానీ ముద్రగడ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే సాక్షి ప్రసారాలు పునరుద్దరించడంతో ప్రభుత్వమే సాక్షి ప్రసారాలు నిలిపివేయించిందనే హోం మంత్రి చెప్పిన మాటని దృవీకరించినట్లయింది. మళ్ళీ జూన్ 27వ తేదీన హైకోర్టు ఈకేసు విచారణకి చేపడుతుంది. సాక్షి ప్రసారాలు పునరుద్దరించబడ్డాయి కనుక ఈ కేసుని వేసిన సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి దానిని ఉపసంహరించుకొంటారో లేకపోతే ప్రభుత్వంపై కక్ష తీర్చుకొనేందుకు అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వానికి హైకోర్టు చేత మొట్టికాయలు వేయిస్తారో చూడాలి.