ముద్రగడతో తలగోక్కున్న రాష్ట్రప్రభుత్వం చేతులుకాల్చుకోకుండానే ”కొరివి” ని వొదిలించుకుంది. 13 రోజుల అనంతరం డిమాండు సాధించుకున్న ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష విరమించారు. అయితే కలెక్టర్, ఎస్ పి ఇంటికి వచ్చి నిమ్మరసం ఇవ్వాలన్న ”గొంతెమ్మ కోర్కె లేదా పంతం” నెరవేర్చుకోకుండానే భార్య తో కలిసి బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కిర్లంపూడి ఇంటికి ప్రయాణమయ్యారు.
కానికాలంలో అరెస్టులు చేసి, ముద్రగడ దీక్షతో తొట్రుపడిన రాష్ట్రప్రభుత్వం ఆయన పంతాలు, కోర్కెలనే ఆసరాగా చేసుకుని ఎక్కడా బయటపడకుండా చాకచక్యంగా వ్యవహరించి చివరి క్షణంలో దృఢత్వాన్ని బయటపెట్టి ముద్రగడను ఏకాకిగా వదిలేసింది.
తుని విధ్వంసాల్లో అరెస్టయిన 13 మందినీ విడుదల చేయాలన్న డిమాండుతో దీక్షప్రారంభించిన ముద్రగడమీద భిన్నిభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అరెస్టయిన వారిలో ఇద్దరికి సంఘటనలతో సంబంధంలేదని వెల్లడి కావడంతో అనుచరులమీద ప్రభుత్వం కక్షసాధిస్తున్నపుడు ఇంతకంటే ఏంచేయగలడు అన్న సానుభూతి వచ్చింది. పరీక్షలకు ఒప్పుకున్నాక మంత్రుల వ్యాఖ్యలతో మళ్ళీ బిగుసుకుని సెలైన్ బాటిల్ విసిరేయడం వంటి పనులతో మళ్ళీ టెన్షన్ పెంచేశారు. (బెయిల్ కి పెట్టుకుంటే అపోజ్ చేయబోము అని మాత్రమే చెప్పాము. కేసులు రద్దుచేస్తాము అనలేదని మంత్రులు వ్యాఖ్యానించారు)
ఆతరువాత విడుదల చేసినవారిని తన ముందుకి తీసుకురావాలనడం…తీసుకొచ్చిన పోలీసువాహనంలోనే కిర్లంపూడి తీసుకువెళ్ళాలని, ఎస్ పి, కలెక్టర్ వచ్చి నిమ్మరసం ఇవ్వాలని ముద్రగడ విధించిన షరతుల్ని ప్రభుత్వం నిర్మొహమాటంగా తోసిపుచ్చింది.
మొత్తం వ్యవహారంలో మధ్యవర్తిత్వం నెరపడంలో బిజెపినాయకుడు, కాపు సామాజిక వర్గీయుడు రాజమండ్రి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, కాపుప్రముఖుడు న్యాయవాది రామారావు కీలకబాధ్యత నిర్వహించారు. అన్నిపార్టీల్లో వున్న కాపు ప్రముఖులు హైదరాబాద్ లో సమావేశమై ముద్రగడకు సంఘీభావం ప్రకటించారు. అయితే వీరెవరూ ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరపలేదు. పట్టేతప్ప విడుపు లేని ముద్రగడ తరపున సంప్రదింపులంటే తలబొప్పే ననుకోవడమే ఇందుకు మూలం!
ఏమైనాగాని ”ఇక మీరు వెళ్ళ వచ్చు” అన్నదే ముద్రగడతో ప్రభుత్వపు చివరి మాటైంది. ఆయన గొంతెమ్మ కోర్కెలవల్లే ఒక కీర్తి ప్రతిష్టలు కోల్పోయిన నాయకుడిగా ఇల్లు చేరుకున్నారు.