భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయాలకి చిహ్నంగా మారిందని షార్ డైరెక్టర్ పి. కునికృష్ణన్ అన్న మాటలు నూటికి నూరు శాతం నిజం. ఈరోజు ఉదయం సరిగ్గా 9.26 గంటలకి నెల్లూరులోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి.-సి34 అంతరిక్ష నౌక ఒకేసారి 20 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకుపోయి 27 నిమిషాలలో వాటన్నిటినీ నిర్దిష్ట కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ విజయంతో అమెరికా, రష్యాల తరువాత స్థానంలో భారత్ కూడా నిలిచింది. అందుకు భారతీయులందరి తరపున ఇస్రోకి తెలుగు 360 కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తోంది.
అమెరికా, కెనడా, ఇండోనేషియా, జర్మనీ దేశాలకు చెందిన ఉపగ్రహాలతో బాటు భారత్ కి చెందిన రెండు ఉపగ్రహాలని కూడా నిర్దిష్ట కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. వాటిలో విశేషం ఏమిటంటే వాటిలో ఒకటి కేవలం 1.5 కేజిన్నర బరువు మాత్రమే గల ‘సత్యభామశాట్’ ని చెన్నైలో సత్యభామ యూనివర్సిటీ విద్యార్ధులు రూపొందించగా, కేవలం కేజీ బరువు మాత్రమే గల ‘స్వయంశాట్’ ని పూణే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్ధులు రూపొందించారు. విదేశీ ఉపగ్రహాలలో గూగుల్ కి చెందిన టెర్రా బెల్లా స్కై శాట్ జెన్ 2-1 కూడా ఉంది.
వరుస విజయాలతో అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న ఇస్రో ప్రపంచాదేశాలకి తన సత్తా చాటుకొంటూనే భారత కీర్తి ప్రతిష్టలని ఇనుమడింపజేస్తూ యావత్ భారతీయులు గర్వించేలా చేస్తోంది. అంతేకాదు..ఇప్పుడు ఇస్రో ప్రపంచ దేశాలకు చాలా తక్కువ ఖర్చుతోనే అంతరిక్షంలో విజయవంతంగా ఉపగ్రహాలను పంపించగల మంచి నమ్మకమైన సంస్థగా పేరు సంపాదించుకొంది.
ఒకేసారి 20 ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టడం వలన వాటికయ్యే ఖర్చు కూడా గణనీయం తగ్గుతుంది. కానీ ఆ ఖర్చుని ఇంకా తగ్గించేందుకు ఇస్రో ఇటీవలే చేసిన మరొక ప్రయోగం కూడా విజయవంతం అయ్యింది. ఇస్రోకి ఎంతో విశ్వసనీయమైన పి.ఎస్.ఎల్.వి. ఉపగ్రహవాహక నౌక ఒకసారి మాత్రమే ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టగలదు. దానినే మళ్ళీ మళ్ళీ ఉపగించుకోగలిగితే ఇంకా తక్కువ ఖర్చుతోనే ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టవచ్చు. ఆవిధంగా మళ్ళీ ఉపయోగించుకోగల ఉపగ్రహ నౌకని కూడా ఇస్రో రూపొందించి, కొన్ని రోజుల క్రితమే పరీక్షించి చూసింది. ఆ ప్రయోగం కూడా విజయవంతం అయ్యింది. కనుక త్వరలో దానిని ఉపయోగించి ఇస్రో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించవచ్చును. ఆ ప్రయోగం కూడా విజయవంతం అయితే, ఇక ప్రపంచ దేశాలలో అంతరిక్ష వ్యాపారంలో భారత్ కి తిరుగు ఉండదు.
ఇప్పటికే విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతూ భారత్ ఖజానాకి కోట్లాది రూపాయాల ఆదాయం సమకూర్చిపెడుతున్న ఇస్రో మున్ముందు భారత ఆర్ధిక వ్యవస్థకి మూలస్థంభంగా మారినా ఆశ్చర్యం లేదు.