ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకి అండగా నిలబడి తెరాస ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. నిర్వాసితులకి అన్యాయం జరుగుతుంటే వారికి అండగా నిలబడి పోరాడటంలో తప్పు లేదు కానీ తమ రాజకీయ మనుగడని కాపాడుకోవడం కోసం నిర్వాసితులని రెచ్చగొట్టడం చాలా తప్పు. వారి తరపున నిలబడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే బదులు, నేరుగా ముఖ్యమంత్రి కెసిఆర్ లేదా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుని కానీ కలిసి మాట్లాడి నిర్వాసితులకి న్యాయం జరిగేవిధంగా చేయవచ్చు. కానీ వారి ఉద్దేశ్యం అది కాదు కనుక ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, నిర్వాసితులకి అండగా నిలిచినట్లు భ్రమింపజేస్తున్నారు.
ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, “ మల్లన్నసాగర్ నిర్వాసితులేమీ మా శత్రువులు కారు. వారు కూడా తెలంగాణా పౌరులే. వారికి అన్ని విధాల న్యాయం చేయవలసిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. వారికి ఎక్కువ ధర లభించాలనే ఉద్దేశ్యంతోనే జి.ఓ. నెంబర్: 123 జారీ చేయడం జరిగింది. అది వద్దనుకొన్నవారు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం పొందవచ్చు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లింపు కోసం కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాము. ఈ రెంటిలో ఏ ఆప్షన్ ఎంచుకొన్నప్పటికీ ఆ పరిహారంతో సంబంధం లేకుండా నిర్వాసితులందరికీ ఇళ్ళు, పాఠశాలలు మొదలైన అన్ని మౌలికవసతులతో కూడిన గ్రామాలని నిర్మించి ఇస్తాము. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు తమ మనుగడ కోసం మా ప్రయత్నాలను అడ్డుకొంటూ రాజకీయాలు చేస్తున్నాయి. వాటి మాటలు నమ్మవద్దని నిర్వాసితులకి విజ్ఞప్తి చేస్తున్నాను. మీతో చర్చలకి సిద్దంగా ఉన్నాను,” అని మంత్రి హరీష్ చెప్పారు.