తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బతుకమ్మ ఉత్సవాలు అనగానే అందరికీ కల్వకుంట్ల కవిత గుర్తుకు వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బతుకమ్మ వేడుకలు జరిపినా..కవిత తన సొంత కార్యక్రమంలా నిర్వహించేది అన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా బీఆర్ఎస్ అధికారం కొల్పోయాక జరుగుతోన్న మొదటి బతుకమ్మ ఉత్సవాల్లో కవిత పాల్గొనడం లేదని తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై విడుదలై వచ్చాక కవిత పూర్తిగా ఇంటికి పరిమితమయ్యారు. ఎలాంటి రాజకీయ అంశాలపై ఆమె నోరు మెదపడం లేదు. మొండిని అరెస్టు చేసి జగమొండిని చేశారు ఇక నుంచి కాస్కొండి అంటూ జైలు నుంచి బయటకు వస్తూ భారీ డైలాగ్ లు పేల్చిన కవిత…కేసీఆర్ ను కలిసిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. బహుశా కేసీఆర్ తన లాగే కొన్నాళ్ళు మౌనంగా ఉండాలని కవితకు సూచించినట్లు ఉంది.
అదే సమయంలో ప్రస్తుతం కవిత స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలకు కవిత దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా బతుకమ్మ వేడుకలపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో..మొదటిసారి కవిత బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉండనుందని సమాచారం.