అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే వైసీపీ రాజకీయానికి ఎమ్మెల్సీల రాజీనామాలు ప్రత్యేక ఉదాహరణగా కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు పూర్తిగా పార్టీ మారకపోయినా కొంత మంది ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు వేస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేసేవారు. తమను అసలు వివరణ అడగకుండా.. తాము పార్టీ మారకపోయినా అనర్హతా వేటు వేశారంటూ ఇద్దరు ఎమ్మెల్సీలు కోర్టుకు కూడా వెళ్లారు. ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు సీన్ మారిపోయింది.
ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా లేఖలు ఇచ్చి నెల దాటిపోయింది. తమ రాజీనామాలు ఆమోదించాలని వారు మళ్లీ లేఖ రాయాల్సి వచ్చింది కానీ నిర్ణయం తీసుకోలేదు. ఆ ఎమ్మెల్సీలను ఏదో విధంగా బుజ్జగించి పార్టీలో కొనసాగించుకుందామని వైసీపీ నేతలు అనుకుంటున్నట్లుగా ఉన్నారు. కానీ రాజీనామా నిర్ణయం మాత్రం వెనక్కి తీసుకోవడం లేదు. చీ కొట్టినా ఎందుకు వెంట పడుతున్నారన్నట్లుగా వారు ఉన్నారు. శాసనమండలి చైర్మన్ కు మరోసారి లేఖ రాశారు.
వైసీపీకి ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే.. ఒక్క సీటు కూడా మళ్లీ ఆ పార్టీకి రాదు. అందుకే చాలా మంది ఎమ్మెల్సీలు రాజీనామా బాటలో ఉన్నారు. కానీ వారిని తమదైన బ్లాక్ మెయిలింగ్ వ్యూహాలతో ఆపాలని అనుకుంటున్నారు. ఎన్నికలకు ముందు మండలి చైర్మన్ తమ వాడని అనర్హతా వేటు వేయించి.. ఎన్నికల తర్వాత రాజీనామాలు చేస్తే ఆమోదించలేని వైసీపీ నిస్సహాయతను చూసి.. రాజకీయాలు మాత్రం ఇలా చేయకూడదని వైసీపీ నేతలే అనుకుంటున్నారు. వైసీపీని వద్దనుకున్నప్పుడు వారిని వదిలేసుకోవాలి కానీ.. బతిమాలుకోవడం ఎందుకని అనుకుంటున్నారు.