బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ రూ. ఆరు వేల కోట్లకు ఐపీవోకి వస్తే… మూడున్నర లక్షల కోట్లు ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. ఆరు వేల కోట్లకు షేర్లు జారీ చేసి మిగతా మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది. ఆ డబ్బు అంతా… ఇన్వెస్టర్లు మార్కెట్లో పెట్టడానికి రెడీగా ఉన్నారనే సంకేతాన్ని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో ఇచ్చింది. రానున్న రోజుల్లో ఐపీవోల విప్లవం రాబోతోంది.
ఐపీవోకు వచ్చేందుకు పాత, కొత్త కంపెనీలు, టెక్ స్టార్టప్ లు గా ప్రారంభమై.. యూనికార్న్ గా మారుతున్న కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరికొన్ని కంపెనీలు రాబోతున్నాయి. స్విగ్గి ఇప్పటికే హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ప్రజలు తమ సంపాదనను స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు పెట్టటడానికి సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు వస్తున్నందున… పెట్టుబడి కోసం కంపెనీలు ఐపీవోలతో ప్రయత్నాలు చేస్తున్నాయి.
సోమవారం ఒక్కరోజే మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి 13 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఐపీవోల ద్వారా ఈ ఏడాదిలో ఇప్పటిదాకా దాదాపు రూ.64,000 కోట్ల నిధులను 62 సంస్థలు సమీకరించాయి. ఈ ఏడాది ఆఖర్లోగా వచ్చే ఐపీవోలతో ఐపీవోల ద్వారా సమీకరించిన మొత్తాల విలువ సుమారుగా రూ.1.25 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. అయితే డీమ్యాట్ అకౌంట్లు బ్యాంక్ అకౌంట్ల తరహాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది షార్ట్ సెల్లర్స్ అవతారం ఎత్తుతున్నారు. ఇవాళ కొని రేపు అమ్మే ప్రయత్నాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
ఐపీవోలు వచ్చినప్పుడు దరఖాస్తు చేసి.. లిస్ట్ అయినప్పుడు అమ్మేసుకుని లాభం పొందాలన్న ఆలోచనలో ఎక్కువ మంది దరఖాస్తు చేస్తున్నారు. ఇలాంటివి ఐపీవోలకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడానికి కారణమని భావిస్తున్నారు. ఏదైనా… స్టాక్ మార్కెట్ లోకి మంచి నమ్మకం ఉన్న కంపెనీ పెట్టుబడుల పిలుపుతో రావాలి కానీ ఎన్ని వేల కోట్లు అయినా ఇచ్చేందుకు జనం రెడీగా ఉన్నారన్నమాట.