ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’ మాస్ సినిమా ప్రభంజనం ఎలా ఉంటుందో చూపించింది. ఎన్టీఆర్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా ఇది. రాజమౌళితో సినిమా చేసిన హీరో తదుపరి ఫ్లాప్ చవి చూడాల్సిందే అనే సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది. రచయితగా కొరటాల బలం ఈ సినిమాని నిలబెట్టింది. అయితే… ‘దేవర’ వెనుక ఓ మరో రైటర్ హస్తం కూడా ఉందట. కొన్ని కీలకమైన సన్నివేశాలకు మరో రచయిత సాయం పట్టినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. అతనే శ్రీకాంత్ విస్సా.
కల్యాణ్ రామ్ ‘డెవిల్’ చిత్రానికి రచయితగా పని చేశారు శ్రీకాంత్ విస్సా. ఇప్పుడు కల్యాణ్ రామ్ కోసం కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారు. `దేవర`కు కల్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామి. అందుకే స్క్రిప్టు విషయంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. శ్రీకాంత్ కూడా కొన్ని సన్నివేశాలకు రాత సాయం అందించారని సమాచారం. స్వతరహాగా కొరటాల మంచి రచయిత. తన బలం రైటింగే. అలాంటి రచయిత… మరో రచయిత కథలో ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఇష్టపడరు. కానీ కొరటాల మాత్రం ఎలాంటి భేషజాలూ లేకుండా మరో రచయిత ఐడియాలజీని కూడా ఆహ్వానించడం విశేషమే.
‘దేవర 1’ అయిపోయింది. ఇప్పుడు అందరి కళ్లూ ‘దేవర 2’పై పడ్డాయి. కానీ ‘దేవర 2’ ఇప్పట్లో ఉండకపోవొచ్చు. మధ్యలో ఎన్టీఆర్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తరవాతే ‘దేవర 2’ ఉంటుంది. ఈలోగా కొరటాల కూడా ఓ ప్రాజెక్టు పూర్తి చేయాలి. తన కెరీర్ మొదలైనప్పటి నుంచీ, ఇప్పటి వరకూ స్టార్ హీరోలతోనే పని చేశాడు కొరటాల. మరి ఇప్పుడు ఏ హీరోతో ప్రొసీడ్ అవుతాడో చూడాలి.