సాహితి ఇన్ ఫ్రా యజమాని బూదాటి లక్ష్మినారాయణను ఈడీ అరెస్టు చేసింది. ఆయన ప్రిలాంచ్ ఆఫర్ల పేర్లతో మధ్యతరగతి ప్రజల రక్తం పీల్చారు. పదిహేను వందలకోట్ల రూపాయలు వసూలు చేసి అందరికీ హ్యాండిచ్చారు. ఇంతకు ముందే పోలీసులు అరెస్ట్ చేశారు.కానీ బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బులు కోల్పోయిన ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదు.
ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుని సొంత ఇల్లు సమకూర్చుకోవాలని అనుకున్న వారి ఆశలను ఆసరాగా చేసుకుని సాహితీ యజమాని బూదాటి లక్ష్మినారాయణ రూ.పదిహేను వందలకోట్లు వసూలు చేశారు. అమీన్పూర్తో పాటు కొంపల్లిలో హైరైజ్ అపార్టుమెంట్లు కడతామని ప్రీ లాంచ్ ఆఫర్లు ఇచ్చాడు. బ్యాంక్ లోన్లు లేకుండా డబ్బులు కట్టిన వారికి అతి తక్కువకే ఫ్లాట్లు కేటాయిస్తానని వందల కోట్లు వసూలు చేశాడు. మూడేళ్లు కనీసం నిర్మాణం ప్రారంభించలేదు సరి కదా.. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో అందరికీ చూపించిన స్థలాన్ని అమ్మేశారు.
రాజకీయ నేతలతో మంచి సంబంధాలు ఉండటంతో ఎంతో డిమాండ్ ఉన్న టీటీడీ బోర్డు సభ్యుడి పదవిని కూడా పొందారు. స్కాం బయటపడిన తర్వాత రాజీనామా చేశారు. బాధితులు పోలీసు కేసులు పెట్టడం మాత్రమే చేయగలుగుతున్నారు. కానీ వారు మాత్రం కొన్ని రోజుల్లో జైల్లో ఉండి బయటకు వస్తున్నారు. కష్టార్జితం పోగొట్టుకునన్ బాధితులు అన్యాయమైపోతున్నారు. వారి కష్టార్జితమంతా రాజకీయ మోసగాళ్ల చేతిలో ఆవిరైపోతోంది. సాహితీ ఇన్ ఫ్రా వంటి వారు చేసిన మోసాలు.. ఇళ్లు కొనాలనుకునేవారికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి.