మీడియా…… స్మార్ట్ ఫోన్ కి ముందూ, తరువాత!
మెయిన్ స్ట్రీమ్ మీడియాను స్మార్ట్ ఫోన్లకు ముందు, స్మార్ట్ ఫోన్ల తరువాత అని చూడవలసి వుంది. ముద్రగడ పద్మనాభాన్ని అరెస్టు చేసి రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి తీసుకు వచ్చింది మొదలు ఆయన ఇంటికి బయలుదేరే వరకూ 13 రోజుల్లో ప్రతిఘట్టంలోనూ ఇది బయటపడుతూనే వుంది. న్యూస్ టివిల కెమేరా మెన్, రిపోర్టర్లు హాస్పిటల్ ముందు బ్రేకప్ న్యూస్ కోసం పడిగాపులు పడుతున్న సమయంలోనే లోపల ఏంజరుగుతున్నదీ టెక్స్ట్ ద్వారా, ఫొటోల ద్వారా, వీడియోల ద్వారా బయటకు వచ్చేసేవి…ఇంటర్ నెట్ కనెక్టివిటీ వున్న స్మార్ట్ ఫోన్ల ద్వారానే ఇదంతా సాధ్యమైంది.
ముద్రగడ వివరాలు విశేషాలూ బయటికి రాకుండా ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా ఫలితం లేకపోయింది. బారికేడ్లు కట్టి, బార్బ్డ్ వైరు పరచి గవర్నమెంటు హాస్పిటల్ రోడ్డుని మూసివేశారు. కిలోమీటర్లకొద్దీ నడవవలసిన పరిస్ధితి తెచ్చి రోగులకు వారి కుటుంబీకులకు నరకం చూపించారు. గేటు దాటనివ్వకుండా ఆపేసిన జర్నలిస్టులు వచ్చీపోయే ప్రతి ఒక్కరినీ వారిని ఏంటి పొజిషన్ అని అడగవలసిన దుస్ధితికల్పించారు. ఇదంతా ముద్రగడకు ప్రపంచానికీ మధ్య సంబంధాలు లేకుండా గోడకట్టేయడమే!
టివి న్యూస్ ప్రజెంటేటర్లు స్పాట్ లో వున్న రిపోర్టర్లని అడిగినట్టు సాధారణ ప్రజలు ఒకరినొకరు “అక్కడ ఏంజరుగుతోంది” అని ప్రశ్నించుకునేలా సమాచారాన్ని తొక్కిపట్టి వుంచారు.
ట్రాఫిక్ మీద ఆంక్షల గురించి రాజకీయ పార్టీలుగాని, ప్రజాసంఘాలుగాని అధికారులకు వినతి పత్రాలైనా ఇవ్వలేదు. సాక్షి టివి చానల్ ప్రసారాలను నిలిపివేయడం మీద లాంచనంగా నిరసన తెలియజేసిన జర్నలిస్టులు…గవర్నమెంటు హాస్పిటల్ లో ప్రవేశం నిలుపుదలపై లోనికి బయటకు వచ్చి వెళ్ళే ఉన్నతాధికారులను తీవ్రంగా నిలదీయడం జరగలేదు. వీటన్నిటికీ మూలం ప్రతిదానికీ ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావడమే!
రోడ్లు మూసేసినా బైపాస్ లు వుండటం వల్లా, చుట్టు తిరగవలసివచ్చినా షేర్ ఆటోలో, సొంత టూవీలర్లో వుండటం వల్లా ఆంక్షలు దైనందిన జీవితాల్ని ఆపివేయలేదు. ప్రజల కష్టాలు వినతి పత్రాలుగా మారలేదు. ఇక జర్నలిస్టులు లోపలికి వెళ్ళలేదన్న మాటే గాని ఏంజరుగుతుందో ఎప్పటికప్పుడు వారికి తెలిసిపోతూనే వున్నాయి. పోలీసులతో సహా జర్నలిస్టుల పర్సనల్ స్నేహాలు వున్న ఎందరెందరో లోపలి నుంచే మేటర్, ఫోటోలు, వీడియోలు షేర్ చేసేవారు. ముద్రగడ చిన్న కుమారుడిని పోలీసులు (కిర్లంపూడిలో) తరిమి తరిమి కొట్టిన వీడియో, ముద్రగడ తలను మంచానికి కొట్టుకుంటున్న దృశ్యాలు ఇలాగే బయటకు వచ్చాయి.
ప్రజల అవసరాలు ఏదోవిధంగా తీరుతున్నంతసేపూ వారు ఏమీ ప్రశ్నించరని, ప్రశ్నించే విలేకరులకు కనబడకుండా తప్పించుకు తిరిగితే చాలని పోలీసు, రెవిన్యూ అధికారులు ఈ 13 రోజుల్లో బాగా అర్ధం చేసుకున్నారు. ఎలాంటి ఆందోళనలనైనా తివాచీ కింద దాచెయ్యడానికి ప్రభుత్వం రాజమహేంద్రవరం నమూనానే వుపయోగించుకునే అవకాశం వుంది.
అదేసమయంలో ”సిటిజన్ జర్నలిస్టులు” ఎలాతయారౌతారో రాజమహేంద్రవరానికి ముద్రగడ దీక్షే నేర్పించింది. సాక్షి చానల్ ను ఆపేయడంతో ఇతర చానెళ్ళు రోజువారీ హాస్పిటల్ బులిటెన్లు తప్ప ఉద్యమ వివరాలను పెద్దగా ప్రసారం చేయలేదు. ఆ లోటును స్మార్ట్ ఫోన్లతో సిటిజన్ జర్నలిస్టులే బర్తీ చేశారు. ఫేస్ బుక్ యూట్యూబ్ లద్వారా అవి విశేషంగా సర్కులేట్ అయ్యాయి.
సోషల్ మీడియా విస్తృతిని, స్మార్ట్ ఫోన్ల ఉధృతాన్ని ముందుగా పసిగట్టిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్ యూట్యూబ్ లో తన ఆప్ డేట్ల ద్వారా తెలుగు టివిల్లోనే హెచ్చూ యూట్యూబ్ ప్రేక్షకులున్న టివిగా నిలబడింది. ముద్రగడ దీక్ష వార్తల్లో ఉద్రిక్తతలు పెంచుతున్నందున సాక్షి టివి ప్రసారాలు నిలిపి వేస్తున్నట్టు హోం మంత్రి స్వయంగా చెప్పాక యూట్యూబ్ లో సాక్షి టివిని వెతుక్కునే ధోరణి మొదలైంది. ప్రింటు, విజువల్ మీడియాల అనుభవం వున్న రాజమహేంద్రవరం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రామ్ నారాయణ ” ఈస్ట్ న్యూస్ టివి” పేరుతో యూట్యూబ్ చానల్ ను క్రియేట్ చేసి ఈ పదమూడు రోజుల్లోనే 70 వరకూ న్యూస్ వీడియో క్లిప్పులను అప్ లోడ్ చేసి ముద్రగడ దీక్ష చుట్టూ అల్లుకున్న వార్తా కథనాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళారు.
నచ్చని న్యూస్ టివిల ప్రసారాలను నిలుపుదల చేయించే నియంతృత్వానికి కెసిఆర్, చంద్రబాబు తెగబడ్డారు. ఎప్పుడో ఒకప్పుడు ఈ ధోరణి ఇతర రాష్ట్రాలకు పాకుతుంది. అలాంటి సందర్భాల్లో విషయాన్ని ప్రజలకు చేర్చే మార్గాలను టివిలు సిద్ధం చేసుకోవాలి. ఇంటిల్లపాదీ టివి ముందు కూర్చుని చూస్తే వుండేటంత ఇంపాక్టు ఒకొక్కళ్ళుగా ఫోన్ లో చూస్తే వుండకపోవచ్చు. అయినా ఇది ప్రత్యామ్నాయమే అవుతుంది.
కట్టవేస్తే నీరు ఆగదు…దారిమార్చుకుంటుంది…ఇపుడు టెక్నాలజీ ఆపని చేస్తూంది