యోగా గురువుల్లో జగ్గీ వాసుదేవ్‌కు ఓ ప్రత్యేకత. ఆయనపై ఇప్పటి వరకూ నిర్దిష్టంగా వచ్చిన ఆరోపణలు లేవు. సేవ్ సాయిల్ .. శివరాత్రి రోజు నిర్వహించే కార్యక్రమాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తమ కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేసుకోకుండా చేసి.. సన్యాసులుగా మార్చారని ఓ తండ్రి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిల్లలు వచ్చి ఇష్టపూర్వకంగానే సన్యాసులుగా మారామని చెప్పారు. అయినా హైకోర్టుకు నమ్మకం కుదరలేదు. ఇంకా చాలా కేసులు ఉన్నందున విచారణ చేయాలని..సోదాలు జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశిచింది. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు పెళ్లి చేసి… ఇతరుల కుమార్తెల్ని మాత్రం ఎందుకు సన్యాసంలోకి ప్రోత్సహిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది.
అయితే ఈషా ఫౌండేషన్ మాత్రం.. తాము ఎవరినీ పెళ్లి చేసుకోవాలని కానీ.. సన్యాసం తీసుకోవాలని కానీ ఒత్తిడి చేసింది లేదని స్పష్టం చేసింది. ఇషా ఫౌండేషన్ కు మద్దతుగా చాలా మందికి ముందుకు వస్తున్నారు. ఆ ఆశ్రమంలో ఉన్న వారు కూడా అదే చెబుతున్నారు. అయితే గతంలో కల్కి ఆశ్రమంలోనూ ఇలాగే చెప్పేవారు. చివరికి ఏమవుతుందో మరి !