ఈతరం రాజకీయాల్లో హుందాతనం అనేది ఎప్పుడో కనుమరుగైంది. పద్దతిగా మాట్లాడేవారిని జనమే కాదు మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. మీడియాకు ఎంత సేపు రేటింగులు, వ్యూస్ మాత్రమే కావాలి కాబట్టి కాంట్రవర్సీ చేసేవారినే పదే పదే చూపిస్తుంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యేవారు.
ప్రభుత్వంపై పోరాడే ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా రచ్చ రచ్చ చేసేవారు. నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ ను చిన్న మాట అనేందుకు కూడా పెద్ద పెద్ద నేతలు భయపడే సమయంలో.. రేవంత్ మాత్రం తీవ్ర పదజాలంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఆ దూకుడే ఆయన్ను పొలిటికల్ సర్కిల్స్ లో హీరోగా నిలబెట్టింది. పీసీసీ చీఫ్ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది.
ఇప్పుడే అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తప్పా, ఒప్పా అని చూడకుండా రేవంత్ రెడ్డిని అవకాశం వస్తే చాలు.. చెలరేగిపోతున్నారు.. తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. మీడియాకు సరుకు అయ్యేలా తన మాటలు ఉండేలా చూసుకుంటున్నారు..
తాజాగా మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్.. రేవంత్ గుర్తుంచుకో..నీ తాట తీయడానికే వచ్చా అంటూ పేర్కొనడం ఇందులో భాగంగానే కనిపిస్తోంది. విషయం ఏదైనా అగ్రెసివ్ గా డీల్ చేయాలని.. హుందాగా వ్యవహరిస్తే మీడియా అటెన్షన్ గ్రాఫ్ చేయడం కష్టమనే ఈ స్ట్రాటజీని పక్కాగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.
పద్దతిగా మాట్లాడితే వాయిస్ జనంలోకి వెళ్ళడం లేదని.. రైమింగ్ లతో మిక్స్ చేసి డైలాగ్ లు కొడుతున్నా ఎక్కడం లేదని..అందుకే పద్ధతి ప్రసంగాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి.. రేవంత్ ను కేటీఆర్ అనుకరిస్తున్నారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.