తనకు చేస్తే అవమానం తాను చేస్తే గౌరవం అనుకుంటారు రాజకీయ నేతలు. నేతలు నేతల మధ్య ఎన్నైనా ఉండవచ్చ కానీ వారు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, కుటుంబాల్ని తమ మధ్య కు తెచ్చి వారిని రోడ్డున పడేయకూడదు. దురదృష్టవశాత్తూ తెలంగాణలో అదే జరుగుతంది. తన ఫోటోకు తప్పుగా క్యాప్షన్ పెట్టి పరువు తీశారని కన్నీరు పెట్టుకున్న కొండా సురేఖ ఇతరుల్ని అంత కంటే ఘోరంగా అవమాననిించారు. తనపై పెట్టిన పోస్టుకు సమర్థింపుగా మాట్లాడిన కేటీఆర్‌ను టార్గెట్ చేయడానికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. కేటీఆర్ ను ఆమె ఎన్ని రకాలుగా తిట్టినా విమర్శించినా అది రాజకీయంగానే ఉంటుంది. కానీ కొండా సురేఖ అసలు కేటీఆర్ కన్నా ఎక్కువగా అసలు వివాదంతో సంబంధం లేదని నాగార్జున కుటుంబాన్ని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకు వచ్చారు. వారి విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఎవరి వైపు నుంచి సమర్థింపు రాదు. ఇంత ఘోరంగా మాట్లాడే మహిళా నేత మరొకరు ఉండదని విమర్శలు కూడా ఎదురొస్తాయి.
నాగార్జున, రకుల్ ప్రీత్ ఫ్యామిలీలపై ఘోరమైన ఆరోపణలు ఏ రాజకీయం ?
కొండా సురేఖపై ఎవరో బీఆర్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు.. నాగార్జున ఫ్యామిలీకి, రకుల్ ప్రీత్ సింగ్‌కు ఏమైనా సంబంధం ఉందా ?. నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సమర్థనీయం కాదు. అసలు ఆమె చేసిన ఆరోపణ కూడా ఓ మహిళగా ఎవరూ చేయలేరమో ?. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉండాలంటే.. సమంతను పంపించాలని కేటీఆర్ అడిగారట. వెళ్లమని నాగార్జున ఫ్యామిలీ చెప్పిందట. కానీ సమంతకు ఇష్టం లేక విడాకులు తీసుకుందట. ఎవరైనా ఇలాంటి మాటలు అనగలరా ?. అలా అన్న మహిళకు కనీస గౌరవం దక్కుతుందా ?. రకుల్ ప్రీత్ విషయంలోనూ అంతే. ఆమె త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కేటీఆర్ కారణమని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ అలవాటు చేశారని కూడా చెప్పారు. ఇవన్నీ కొండా సురేఖపై ఎవరైనా ఏమైనా అభిమానం చూపించేవారు ఉంటే వారు కూడా అసహ్యించుకునేలా ఉన్నాయి.
కొండా సురేఖ పడిన బాధ రాజకీయాలతో సంబంధం లేని ఆ కుటుంబాలకు ఉండదా ?
కొండా సురేఖను ఇప్పటి వరకూ ఫైర్ బ్రాండ్ అని చెప్పేవారు. రాజకీయాలపై ఆమె చేసే విమర్శలు డైనమిక్ గా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రాజకీయం అంతా ఎటుపోయిందో కానీ..తన మాటల వల్ల తన రాజకీయంతో సంబంధం లేని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని ఎందుకు అనుకోలేదు. సమంత కానీ.. నాగ చైతన్య కానీ తమ విడాకుల విషయాన్ని ఎప్పుడూ బహిరంగంగా చర్చకు పెట్టుకోలేదు . వారి వ్యక్తిగత విషయాలను వ్యక్తిగతంగానే ఉంచుకున్నారు. కొండాసురేఖ రాజకీయం చేయడం అంటే.. గౌరనీయమైన ప్రజాప్రతినిధిగా.. మంత్రిగా ఉండే అర్హత ఆమె కోల్పోయారని అన్ని వైపుల నుంచి విమర్శలుు వస్తే అందులో తప్పేం లేదు. ఒక్క సోషల్ మీడియా పోస్టుతో తాను పడిన బాధను.. రాజకీయాలతో సంబంధం లేని కుటుంబాలకు తన మాటలతో పంచారు కొండా సురేఖ.
రేవంత్ ప్రభుత్వానికీ మచ్చే !
కొండా సురేఖ నాగార్జున కుటుంబానికి, రకుల్ కుటుంబానికి బేషరతుగా క్షమాపణలు చెబితినే ఎంతో కొంత గౌరవంగా ఉంటుంది. లేకపోతే ఆమెకు కనీస గౌరవం ఇచ్చేవారు తగ్గిపోతారు. ఆమె అన్న మాటలకు కనీస ఆధారాలు ఉండవు. ఎక్కడెక్కడి గాసిప్సో వెదుక్కని వచ్చి చెప్పడం గౌరవనీయమైన వ్యక్తుల లక్షణం కాదు. వాటికి ఆయా కుటుబంాలు వివరణ ఇచ్చుకున్నా అసహ్యంగా ఉంటుంది. కొండా సురేఖ ఏ మహిళా నేత చేయని తప్పు చేశారు. అందులో అనుమానపడాల్సినదేమీ లేదు. కొండా సురేఖ వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి కూడా మరక లాంటివే.