ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. “దానిని కాపాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితి ఇంకా దిగజారుతూనే ఉంది. దాని భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా ఉంది. అందుకే పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవలసి వస్తోంది.” ఈ మాటలు అన్నదెవరో కాదు. ఆ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. ఆ ముక్క చెప్పేసి ఆయన వైకాపాలోకి వెళ్లిపోయారు. ఆయన కంటే ముందు, ఆ తరువాత కూడా అనేక మంది కాంగ్రెస్ నేతలు అదే కారణంతో వెళ్ళిపోయారు. అప్పటి నుంచి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఒక్కరే ఒంటి చేత్తో నెట్టుకొంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు చిరంజీవి, పల్లం రాజు, కెవిపి వంటి వాళ్ళు అప్పుడప్పుడు మొహాలు చూపించి హడావుడి చేసి వెళ్లిపోతుంటారు తప్ప పార్టీని కాపాడుకోవడానికి చేసిందేమీ లేదు.
ఎవరికీ తప్పినా కాంగ్రెస్ కాడి ఎత్తుకొన్న పాపానికి రఘువీర రెడ్డికి మాత్రం తప్పదు కనుక నిత్యం ఏదో ఒక సమస్యని వెతికిపట్టుకొని మీడియా ముందుకు వచ్చి దాని గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉందని ప్రజలకి గుర్తు చేస్తుంటారు. కాకపోతే చాలా ముందుచూపుతో ప్రతీసారి ఆ అవకాశాన్ని మొదట జగన్మోహన్ రెడ్డికే ఇస్తుంటారు. సదావర్తి సత్రం భూముల కుంభకోణం మీద జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసి అలిసిపోయి లండన్ వెళ్లిపోయిన తరువాత ఇప్పుడు రఘువీరా రెడ్డి ఆ మ్యాటర్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొన్నట్లు కనిపిస్తోంది. కెవిపి రామచంద్రరావు, పల్లం రాజులని వెంటబెట్టుకొని గవర్నర్ నరసింహన్ ని కలిసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పిర్యాదు చేసి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసే పిర్యాదులనే ఆయన బుట్ట దాఖలు చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్ పార్టీ చేసే పిర్యాదులని పట్టించుకొంటారని ఆశించడం అత్యాశే అవుతుందని వారికీ తెలిసే ఉంటుంది. కానీ ఇటువంటి హడావుడి ఏదో ఒకటి చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటుం(డే)దని ప్రజలు మరిచిపోయే ప్రమాదం ఉంది కనుక శ్రమ తీసుకోక తప్పడం లేదనుకోవాలి. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరైనా మిగులుతారో లేదో తెలియదు కానీ రఘువీరా రెడ్డి పట్టుదలని, నమ్మకాన్ని, పోరాటస్పూర్తిని మెచ్చుకోకుండా ఉండలేము.