హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. హైడ్రా ఓ కారణం అయితే మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఇళ్లను రియల్టర్లు నిర్మించకపోవడం మరో కారణం. ప్రస్తుతం కొంత స్తబ్దత నెలకొంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మెట్రో రెండో దశను ప్రకటించింది. ఇది రియల్ ఎస్టేట్ వర్గాలకు ఆశాకిరణంలా మారింది. మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్‌కు సంబంధించిన డీపీఆర్‌లకు కేంద్రం ఆమోదం లభించడమే తరువాయి. మెుత్తం 5 మార్గాల్లో కలిపి 78.6 కిలో మీటర్లుగా రెండో దశను ప్రతిపాదించారు.
హైదరాబాద్ మెట్రో రెండవ దశలో ప్రతిపాదించిన అన్ని మార్గాలు మొదటి దశలోని మూడు కారిడార్లకు కొనసాగింపుగా ఉన్నాయి. అంటే అటు హయత్ నగర్.. ఇటు పటాన్ చెరువు వరకు మరో వైపు ఎయిర్ పోర్టు వరకూ మెట్రో అందుబాటులోకి వస్తుంది. ఎల్బీనగర్, మైలార్ దేవుపల్లి, జల్పల్లి, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 22 స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల వల్ల విజయవాడ జాతీయ రహదారిపైన హయత్ నగర్, ముంబై జాతీయ రహదారిపైన పటాన్ చెరు నుంచి మొదలు సంగారెడ్డి వరకు, బెంగళూరు జాతీయ రహదారిపైన శంషాబాద్ నుంచి మొదలు షాద్ నగర్ వరకు, మరోవైపు ఫ్యూచర్ సిటీ వరకు రియల్ ఎస్టేట్ ఊపందుకోనుంది.
ఇప్పటికే అయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం ఇంకా సరైన విజన్ ను బయట పెట్టకపోవడంతోనే సమస్య వస్తోంది. ఇప్పుడు మెట్రో రూపంలో రవాణా సౌకర్యం పెరిగితే మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు ఆయా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. భవిష్యత్ పెట్టుబడుల కోసమూ కొనుగోళ్లు చేస్తారు. అందుకే మెట్రో నిర్మాణ పనుల ప్రారంభం కోసం రియల్ ఎస్టేట్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.