మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ, తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తోపాటు సినీ ఇండస్ట్రీ భగ్గుమంది. రాజకీయ ప్రత్యర్ధిపై విమర్శలు, ఆరోపణలు చేసుకోండి.. అంతేకాని ఈ విషయంతో అసలే మాత్రం సంబంధం లేదని సినీ ప్రముఖులను వివాదాల్లోకి లాగుతారా? అంటూ తెలుగు ఇండస్ట్రీ పెద్దలంతా ఖండించారు.
కొండా సురేఖ తన వ్యక్తిత్వంపై దాడి చేసిందంటూ కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసు పంపారు. బీఆర్ఎస్ కీలక నేతలంతా కొండా వ్యాఖ్యలను ఖండించారు. అప్పటివరకు కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ అన్నట్లుగా సాగిన ఈ వ్యవహారంలో సురేఖ చేసిన వ్యాఖ్యలు పక్కదోవపట్టడంతో.. అంత వరకు కొండా సురేఖను వెనకేసుకు వచ్చిన కాంగ్రెస్ నేతలూ.. ఆ తర్వాత ఆమె వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో తెలియక మిన్నకుండిపోయారు. అతికొద్ది మంది నేతలు మాత్రమే కొండా సురేఖకు సపోర్ట్ గా నిలబడ్డారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సినీ ప్రముఖులు ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. కొండా సురేఖ సమంత గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని చెప్పారు. సినీ ప్రముఖులు కొండా సురేఖ గురించి కేటీఆర్ చేసిన ట్వీట్ లను కూడా పరిశీలించాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ఈ తరహ వ్యాఖ్యలు చేయకూడదని కోరుతున్నట్లు ప్రత్యేకంగా వీడియో రిలీజ్ చేశారు.