రాజకీయాల్లో సీనియర్లు ఎందుకు ఆచితూచి స్పందిస్తారో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది. అప్పటివరకు అంతా సాగిపోతున్న తరుణంలో ఒక్కమాట ఎంత డ్యామేజ్ చేస్తుందో కొండా సురేఖ ఉదంతం కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన వికృత పోస్టింగ్ లతో బాధితురాలిగా మారిన కొండా సురేఖపై మొదట్లో పెద్దఎత్తున సానుభూతి వ్యక్తమైంది. వ్యక్తిత్వ హననం చేశారని ఆమెపై సానుభూతి పవనాలు వీయగా.. కేటీఆర్ పై రాజకీయాలకతీతంగా కన్నెర్ర జేశారు.
ఆ మద్దతును మరింత క్యాష్ చేసుకొని కేటీఆర్ ను ఇరుకున పెట్టే అవకాశం ఉన్నా కాళ్లదన్నుకున్నారు కొండా సురేఖ. విషయాన్ని సైడ్ ట్రాక్ చేసి.. సంబంధం లేని విషయాలను ప్రస్తావించి బాధితురాలు కాస్త భ్రష్టురాలుగా మిగిలిపోవాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు. ఇంటా, బయటా అంతటా వ్యతిరేకత తెచ్చిపెట్టుకున్నారు. అసలు ఈ ఎపిసోడ్ లో కేటీఆర్ ఇరుకునపడే ప్రమాదం ఉన్నా దానిని తప్పించింది కొండా సురేఖ వ్యాఖ్యలే.
కేటీఆర్ ను విమర్శించేందుకు భావోద్వేగంతోనే ఈ వ్యాఖ్యలు చేశాయని, తన వ్యాఖ్యలను కొండా సురేఖ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ప్రత్యర్ధిని ఢీకొట్టాలంటే భావోద్వేగంతో అసలు అయ్యేపని కాదు. భావోద్వేగం సానుభూతిని తెచ్చిపెట్టేలా ఉండాలి. లేదంటే తలెత్తుకోలేని విధంగా బద్నాం అయిపోతారు..ఇప్పుడు కొండా సురేఖ ఈ రెండో జాబితాలో చేరిపోయారు.
అందుకే రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడటం మంచిది.. లేదంటే అప్పటివరకు సంపాదించుకున్నా ఏళ్ళనాటి ప్రతిష్టను ఒక్కనోటి మాట పెకిలిస్తుందని కొండా సురేఖ ఎపిసోడ్ స్పష్టం చేసిందనే అభిప్రాయం వినిపిస్తోంది.