కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. చిన్న, చిన్న అసంతృప్త రాగాలు మినహా రేవంత్ పాలన అంత సాఫీగానే సాగుతోంది. ఆరు గ్యారెంటీల్లో కీలకమైన మహాలక్ష్మి , రైతు రుణమాఫీ , 200యూనిట్ల ఉచిత విద్యుత్ వంటివి అమలు అవుతుండటంతో ఈ పది నెలల రేవంతుడి పాలనకు మంచి మార్కులే పడ్డాయి.
కాలం గడుస్తున్న కొద్దీ ప్రభుత్వాలు తప్పులు చేస్తుంటాయి. ప్రతిపక్షానికి అవి అస్త్రంగా మారుతాయి. కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వంపై కూడా కొంత వ్యతిరేకత మొదలు అవుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. హైడ్రాపై మొదట్లో ప్రశంసలు కురిసినా మూసీ ప్రాంత ప్రజల నివాసాలను కూల్చడంతో సర్కార్ తీరు వివాదాస్పదం అయింది. ఈ విషయంలో సర్కార్ కు సరైన స్పష్టత ఉన్నా..వాటిని ప్రజలకు వివరించి ప్రజామోదం పొందటంలో విఫలమయ్యారు. అదే గ్రేటర్ లో వ్యతిరేకత బీజం ఏర్పడటానికి కారణం అయిందని టాక్ నడుస్తోంది.
హైడ్రాపై సర్కార్ హైరానా నేపథ్యంలోనే కొండా సురేఖ కామెంట్స్ ఎంత దుమారం రేపాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రతి విషయంలో రేవంత్ ను ఇరుకున పెట్టడమే టార్గెట్ గా ముందుకు వెళ్తున్న బీఆర్ఎస్.. ఈ వ్యవహారంలోనూ ఆయన్నే టార్గెట్ చేసింది. కొండా వ్యాఖ్యలపై రేవంత్ స్పందించాలని, మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. ఈ విషయం ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కాంగ్రెస్ సర్కార్ తో సఖ్యతగా ఉందా అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్రమంలోనే సినీ ప్రముఖులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు …ఇండస్ట్రీకి – ప్రభుత్వానికి మధ్య దూరం పెంచుతుందని అంటున్నారు.
రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలపై పునః సమీక్ష చేసుకుంటూనే..మంత్రుల విషయంలో కటువుగా వ్యవహరించాలని లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పాలనపై మొదట్లో సర్కార్ పట్టు సాధించినా..ఆ పట్టు క్రమంగా సడలుతోందని..రేవంత్ కు సూచిస్తున్నారు.