కేబినెట్ మంత్రి కొండా సురేఖ తనకు జరిగిన అవమానం విషయంలో అతిగా రెస్పాండ్ అయ్యారు. వివాదంతో సంబంధం లేని నాగార్జున ఫ్యామిలీని కూడా కలిపి ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ఆమె తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. మిగతా ఏమైనా ఉంటే నాగార్జున న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. వివాదాన్ని ఇంతటితో ఆపేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా పిలుపునిచ్చారు. అయినా టాలీవుడ్లో కొంత మంది అతిగా స్పందిస్తూనే ఉన్నారు.
తప్పు జరిగింది..దాన్ని సురేఖ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత కూడా సినీ ప్రముఖుల అతి స్పందన కాంగ్రెస్ పెద్దల్ని అగ్రహానికి గురి చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కుక్కిన పేనులా పడి ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం తమ కంటే రోషగాళ్లు లేనట్లుగా వ్యవహరించడంపై కాంగ్రెస్ పెద్దల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వివాదం ముగించాలని పిలుపునిచ్చిన తర్వాత కూడా కొంత మంది చేసిన అతి సీఎం రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ విషయంలో రేవంత్ అసంతృప్తిగా ఉన్నారు. గద్దర అవార్డుల విషయంలో కలసి రావడం లేదు. కానీ టిక్కెట్ రేట్లపెంపు ఇతర విషయాల కోసం మాత్రం పరుగులు పెడుతూ వస్తున్నారు. ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే ముందుకు వస్తున్నారు. ఇక టాలీవుడ్ విషయంలో సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని.. కఠినమైన మార్గాన్నే ప్రభుత్వం ఎంచుకుంటుందని చెబుతున్నారు. అయితే స్పందన లేకపోవడం. ..లేకపోతే అతిగా స్పందించడం అనే లక్షణాన్ని వదులుకుని న్యూట్రల్ గా ఉండే ప్రయత్నం చేస్తే టాలీవుడ్ కు మంచిదన్న సలహాలు వస్తున్నాయి.