పెళ్లి చేసుకున్నా సరే భార్య అనుమతి లేకుండా చేసే శృంగాన్ని రేప్ గా పరిగణించాలని వస్తున్న డిమాండ్లపై కేంద్రం భిన్నంగా స్పందించింది. అది సామాజిక సమస్య తప్ప చట్టపరమైన సమస్య కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రం అభిప్రాయం సముచితంగా ఉందన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఇలాంటి వాటిని చట్టబద్ధం చేస్తే దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు కొన్ని విషయాల్లో ఉన్న ప్రత్యేక చట్టాలు, ప్రివిలేజెస్ కారణంగా తప్పుడు కేసులు పెద్ద ఎత్తున పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
చట్టబద్దంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న జంట శారీరకంగా కలవడం అనేది సహజం. తన భర్త శారీరకంగా పటుత్వం లేని వ్యక్తి అని విడాకులు కోరే భార్యలు ఉంటారు. కానీ తన భార్య శృంగారానికి సహకరించడం లేదని విడాకులు కావాలని మగాళ్లు కోర్టుకెళ్లే సందర్భాలు చాలా తక్కువ. ఇటీవలి కాలంలో మహిళలు తమ భర్తతో కలసి ఉండటం ఇష్టం లేకపోతే… విడాకుల కోసం వెళ్తూ అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ మారిటల్ రేప్ ను కూడా చట్టబద్దం చేస్తే ప్రతి ఒక్కరూ అదే కారణం చెప్పే అవకాశాలు ఉన్నాయి.
కేంద్రం వివాహ వ్యవస్థకు పెను ముప్పుగా ఏర్పడే మారిటల్ రేప్ అనే అంశంపై సముచితంగా స్పందించిందని అనుకోవచ్చు. భారతీయ వివాహ వ్యవస్థలో పెళ్లి తరవాత శృంగారాన్ని రేప్ అని భావించే అవకాశమే ఉండదు. కానీ నయా ఫెమినిస్టులు కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చి దాన్ని చట్టంలోకి మార్పించేందుకు చేస్తున్న ప్రయత్నంతోనే సమస్యలు వస్తున్నాయి. ఇదే గనుక చట్టంలో చేరిస్తే.. ఇక భర్తపై కోపం వచ్చిన ప్రతి మహిళ ఈ రేప్ కేసు పెడుతుంది. అది వివాహ వ్యవస్థకు ముప్పుగా మారుతుంది.