తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ను కొనసాగించాలా? లేక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా? అనే విషయంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ వ్యవహారం దర్యాప్తు కోసం కేంద్ర , రాష్ట్ర అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎంపీలు సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ లపై జస్టిస్ గవాయి.. జస్టిస్ విశ్వనాథన్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్దార్థ్ లూథ్రా, ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించగా.. పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తైన అనంతరం లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయలని, ఇందులో సీబీఐ , ఇద్దరూ రాష్ట్ర పోలీసులు అధికారులు, ఒక సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారితో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
లడ్డూ కల్తీ వ్యవహారం అంతా సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో సాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజకీయంగా లడ్డూ విషయంలో ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలను చేయవద్దని ఆదేశించింది.