టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఊరట లభించింది. ఈ కేసులో నందిగం సురేష్ తోపాటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డికీ ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో గత నెలలో నందిగం సురేష్ తోపాటు శ్రీనివాస్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అజ్ఞాతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్ ను హైకోర్టు కొట్టివేయడంతో నిందితులుగా ఉన్న మరికొంతమంది నేతలు దేవినేని అవినాష్ , లేళ్ళ అప్పిరెడ్డిలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి ఊరట లభించింది. వారికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆలోపే నందిగం సురేష్ అరెస్ట్ కావడంతో ఆయన కొన్ని రోజులుగా రిమాండ్ లోనే ఉండిపోయారు.
ఈ క్రమంలోనే నందిగం సురేష్ ఏపీ హైకోర్టులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా…షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు. శుక్రవారం సాయంత్రం నందిగం సురేష్ బెయిల్ పై విడుదలయ్యే అవకాశం ఉంది.