తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసులు, ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారితో కొత్త సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించగా.. ఈ విషయంపై వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలతో చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమయ్యారు.
సుప్రీంకోర్టు కొత్త సిట్ ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో తమ వాదన నెగ్గిందని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. రాష్ట్ర అధికారులతో నిండిన సిట్ ఏర్పాటుతో వాస్తవాలు వెలుగులోకి రావని..సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో జరిగే సిట్ తో లడ్డూ విషయంలో అసలు రాజకీయం బయటకు వస్తుందని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు వైసీపీకి ఆశాజనకంగా ఏమి లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని వైసీపీ కోరింది. కానీ, సుప్రీంకోర్టు మధ్యేమార్గంగా ఉండేందుకుగాను ఇద్దరు చొప్పున కేంద్ర, రాష్ట్ర అధికారులతో కొత్త సిట్ ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కొత్త సిట్ లో ప్రస్తుతం ఉన్న సిట్ లోని అధికారులు ఉండవచ్చు.. లేకపోవచ్చు. అది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అదే జరిగితే మరోసారి వైసీపీ అభ్యంతరం తెలిపే అవకాశం ఉంది.
కొత్తగా ఏర్పాటు చేసే సిట్ లో ఎలాగూ రాష్ట్ర పోలీసు అధికారులు తప్పనిసరిగా ఉంటారు. అసలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లేని దర్యాప్తు వ్యవస్థను వైసీపీ కోరింది. సుప్రీంకోర్టు నిర్ణయం వైసీపీకి అనుకూలంగా లేకపోయినా..తమ వాదన నెగ్గిందని ప్రచారం చేసుకోవడం ఏంటో వారికే తెలియాలి.