నిబంధనలకు విరుద్దంగా ఫామ్ హౌజ్ లను నిర్మించుకొని జల్సాలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. వారి వెనకున్న కేవీపీ రామచంద్రరావుల ఫామ్ హౌజ్ లను కూల్చాలా? వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఏఐసీసీ నేతలతో సన్నిహితంగా మెదిలే కేవీపీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయం చర్చనీయాంశం కావడంతో తాజాగా ఈ అంశంపై కేవీపీ స్పందించారు.
తన వలన కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు రావడం ఇష్టం లేదని.. తన ఫామ్ హౌజ్ అక్రమ నిర్మాణం అయితే కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ తీసుకునే ప్రతి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని..పార్టీలో కీలక పదవులను నిర్వర్తించిన తను… తన గురించి ముఖ్యమంత్రికి చెప్పాల్సి రావడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అజీజ్ నగర్ లో తన కుటుంబ సభ్యులపై ఉన్న ఫామ్ హౌజ్ విషయంలో విపక్షాలు తనను పావుగా వాడుకోవడం బాధ కలిగిస్తోందని వాపోయారు. అధికారులను ఫామ్ హౌజ్ వద్దకు పంపించాలని..అవి అక్రమ నిర్మాణాలు అని తేలితే తన సొంత ఖర్చుతో కూల్చివేయిస్తానని లేఖలో పేర్కొన్నారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దన్నారు.
కేవీపీ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.