పోలీస్. ఇరవై నాలుగ్గంటలూ వారానికి ఏడు రోజులూ డ్యూటీ. వారాంతపు సెలవు లేదు. విశ్రాంతికి వీలులేదు. అందుకే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇవన్నీ గమనించిన కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్, రాష్ట్రంలో తొలిసారిగా వీక్లీఆఫ్ విధానం ప్రారంభించారు.
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సీఐ స్థాయి అధికారులు, కానిస్టేబుళ్లకు ఇక ప్రతి వారం ఒక రోజు సెలవు దినం. వారాంతపు సెలవు లేకపోవడం వల్ల చాలా మంది పోలీసులు బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారని ఎస్పీ చెప్పారు. అందుకే ఇక అందరికీ వీక్లీఆఫ్ ఇస్తున్నట్టు తెలిపారు.
ఎవరికి ఏ రోజు వీక్లీ ఆఫ్ అనే వివరాలను జిల్లా పోలీస్ శాఖ వెబ్ సైట్లో ఉంచుతారు. ఒక వేళ స్టేషన్ లో ఉన్న పోలీసుల్లో ఒకేసారి ఒకరిద్దరు సెలవు పెడితే మిగతా వారు సర్దుకోవాలి. అవసరమైతే వీక్లీ ఆఫ్ నాడు పనిచేసి మరో రోజు తీసుకోవాలి. ఇది ఎమర్జెన్సీ సర్వీసు కాబట్టి ఈమాత్రం అడ్జెస్ట్ మెంట్ తప్పదనేది ఎస్పీ ఉద్దేశం. దీనికి పోలీసులు కూడా సై అన్నారు.
వారానికో రోజు విశ్రాంతి దొరికితే పోలీసులు ఫిట్ నెస్ పైనా దృష్టి పెట్టే వీలుంటుంది. ఇప్పుడు చాలా మందికి అది కుదరడం లేదు. ఎప్పుడు స్టేషన్ కు పరుగెత్తాల్సి వస్తుందో, ఎప్పుడు ఏ కేసు విచారణలో తిరగాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. కాబట్టి రెగ్యులర్ గా వ్యాయామం చేయడం కూడా వీలు కావడం లేదంటారు చాలా మంది పోలీసులు. అందుకే కొందరి పొట్టలు పెరగడం కనిపిస్తుంది. అది బద్ధకం కాదు, సమయం లేకపోవడమే అనేది పోలీసుల వాదన.
పోలీసులకు వారాంతపు సెలవు గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ దీనిపై చాలా కాలంగా మాట్లాడుతున్నారు. మరి ఏ రాష్ట్రంలో అయినా అమలు చేశారేమో తెలియదు. ఎక్కడా చేసి ఉండకపోతే, బహుశా కరీంనగర్ జిల్లాలోనే దీనికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందేమో.