రాజమౌళితో సినిమా అంటే ఎంత పెద్ద ముచ్చటో ప్రత్యేకంగా చెప్పాలా? ఆ హీరో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ‘ఆన్ ది వే’ అని ఫిక్సయిపోవొచ్చు. నాలుగేళ్లు మరో సినిమా ఊసు లేకుండా, ఆ ప్రాజెక్టుతోనే గడిపేసినా ఫ్యాన్స్ ఓకే. ఎందుకంటే, ఆ నిరీక్షణలకు తగన ప్రతిఫలం తప్పకుండా వస్తుందన్న భరోసా. కానీ రాజమౌళి సినిమా తరవాత తమ హీరో పరిస్థితేమిటన్నదే పెద్ద దిగులు. ఎందుకంటే ‘సింహాద్రి’ మొదలు, రాజమౌళితో సినిమా తీసి హిట్టుకొట్టిన ప్రతీ హీరో, ఆ తరవాత వరుస ఫ్లాపులు కొని తెచ్చుకోవడం సెంటిమెంట్ గా మారిపోయింది. రాజమౌళి హిట్ ఇచ్చి అంచనాలు పెంచేయడం, ఆ తరవాత దాన్ని హ్యాండిల్ చేయలేక హీరోలు సతమతమవ్వడం చూస్తూనే ఉన్నాం. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ఇలాంటి పరాభవాలే తప్పవని టాలీవుడ్ భావించింది. అయితే `దేవర`తో తొలిసారి ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. రాజమౌళితో హిట్ కొట్టాక కూడా ఆ ఫామ్ కొనసాగించొచ్చు అని ఎన్టీఆర్ నిరూపించాడు. దాంతో ఇప్పుడు అందరి కళ్లూ రామ్ చరణ్ పై పడ్డాయి.
శంకర్ తో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. డిసెంబరులో విడుదలకు సిద్ధమైంది. శంకర్ సినిమా, పైగా దిల్ రాజు బ్యానర్… కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. పాటలెలా ఉన్నా, ప్రమోషన్ కంటెంట్ పై అసంతృప్తి ఉన్నా, సినిమా వచ్చేసరికి తప్పకుండా ఓ హైప్ అంటూ క్రియేట్ అవుతుంది. దిల్ రాజు ప్రమోషన్ వ్యూహాలు బాగుంటాయి. ఓ పాట విడుదల చేయాలన్నా ఆయన హడావుడి చేస్తున్నారు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా ‘దేవర’కు అంత హైప్ వస్తే, ఇక దిల్ రాజు ఎంత తీసుకురాగలరు? సినిమాపై కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా, దిల్ రాజు దాన్ని హిట్ వరకూ తీసుకెళ్లిపోగలరు. దానికి తోడు ఇప్పుడు ఎన్టీఆర్ కూడా `దేవర`తో కావల్సినంత బూస్టప్ ఇచ్చాడు. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి, కొత్త ఉత్సాహాన్ని నింపాడు. ఇదే జోష్‌లో.. చరణ్ కూడా ‘గేమ్ ఛేంజర్’తో హిట్టు కొడితే… ఇక టాలీవుడ్ లో రాజమౌళి సెంటిమెంట్ భయాలకు పూర్తిగా పుల్ స్టాప్ పెట్టినట్టవుతుంది.