సుప్రీంకోర్టు సిట్‌లో సీబీఐ, FSAAI అధికారుల్ని కూడా చేర్చాలని ఆదేశించిన తర్వాత వైసీపీ నేతలకు గుండెల్లో రాళ్లు పడినట్లుగా అయినట్లుగా ఉంది. తీర్పును స్వాగతించే నెపంతో మీడియా ముందుకు వచ్చి తాము చెప్పాలనుకున్నది చెప్పారు. ఇందులో వైవీ సుబ్బారెడ్డి అయితే..తనకేం సంబంధం భూమన హయాంలోే ఏఆర్ డెయిరీ నెయ్యి వచ్చిందని తేల్చారు. సుబ్బారెడ్డి మాటలు వింటే తాను మాత్రం బలి పశువు అయ్యేందుకు సిద్దంగా లేనని ఆయన చెప్పినట్లయింది.
తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక్క ట్యాంకర్ కూడా ఏఆర్ డెయిరీ నెయ్యి కొండపైకి రాలేదన్నారు. ప్రస్తుతం ఏఆర్ డెయిరీ అంశంపైనే వివాదం ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి హయంలోనే టెండర్ రూల్స్ మార్చి మారీ టెండర్లు ఇచ్చారని అసలు ఏఆర్ డెయిరీకి ఎలాంటి సామర్థ్యం లేదని తేలింది. దీంతో కనీసం ఈ స్కామ్ నుంచి అయినా తాను బయటపడాలని సుబ్బారెడ్డి అనుకున్నారు. భూమన తన కుమారుడికి ఎన్నికల ఖర్చుల కోసం చేసిన అక్రమాల్లో ఇది కూడా ఒకటని భావిస్తున్నారు.
వైవీ సుబ్బారెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోంది. భూమన హయాంలో లడ్డూకల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో తిరుమలలో జరిగే అవినీతి వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తే.. ఒకరి మీద ఒకరు తోసేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.