కడప జిల్లాను మళ్లీ కడప జిల్లాగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అందరూ కడప జిల్లా అనే చెబుతున్నప్పటికి రికార్డుల్లో కడప జిల్లా లేదు. వైఎస్ఆర్ జిల్లా అని ఉంది. కనీసం వైఎస్ఆర్ కడప కూడా లేదు. అంతకు ముందు వైఎస్ఆర్ కడప అని ఉండేది.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సమయంలో జగన్ రెడ్డి కడప కూడా తీసేసి వైఎస్ఆర్ జిల్లా అనిపెట్టారు. అధికార ఉత్తర్వుల్లో వైఎస్ఆర్ జిల్లా అనేపేరే చెలామణి అవుతోంది. ఇప్పుడు మళ్లీ దానికి కడప పేరు పెట్టాలన్న డిమాండ్ వనిపిస్తోంది.
వైఎస్సార్ జిల్లా’ పేరును మార్చాలని సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు. వైఎస్సార్ జిల్లా అనే పేరు వల్ల ప్రసిద్ధమైన ఎంతో చారిత్రకమైన పేరు అదృశ్యమైపోయిందన్నారు. అందుకే పేరును కడప జిల్లాగా మార్చాలని చంద్రబాబును కోరారు. సత్యకుమార్ స్వయంగా కడప జిల్లాకు చెందిన నేత. మిగతా ప్రజాప్రతినిధులంతా త్వరలో ఇదే అంశంపై ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రబాబునాయుడు ఇలా పేర్లు మార్చే రాజకీయాల గురించి అసలు ఆలోచించరు. కానీ ప్రజల సెంటిమెంట్లను పట్టించుకోవాలనుకుంటే మార్చే అవకాశాలు ఉన్నాయి.
వైఎస్ఆర్ పేరును పూర్తిగా తీసేయకపోయినా.. వైఎస్ఆర్ కడప అని అయినా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కడప అనే పేరుకు సుదీర్ఘమైన .. చారిత్రాత్మకమైన నేపధ్యం ఉంది. అందుకే పలువురు సాహితీ వేత్తలు మొదట్లోనే కడప పేరును మార్చడాన్ని వ్యతిరేకించారు. ఇలాంటి వారంతా ముందుకు వచ్చి రాజకీయ కారణాలతో కాకుండా ప్రజాభిప్రాయం ద్వారానే మారుస్తున్నామన్న అభిప్రాయాన్ని కల్పించగలిగితే ప్రభుత్వం కూడా చొరవ చూపే అవకాశం ఉంది.