దేశంలో చాలా ప్రభుత్వాలకు భూసేకరణ సమస్యే రాజకీయ గండంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వంత నియోజకవర్గమైన గజ్వేల్ పరిధిలో మల్లన్న సాగర్ కోసం భూమి సేకరించాలనే ప్రయత్నం కొండ కిష్టాపూర్తో సహా నాలుగు గ్రామాల్లో పూర్తిగా ప్రతిఘటనను ఎదుర్కొంటున్నది. 2013 భూ సేకరణ చట్టం పక్కన పెట్టి తాము ఏకపక్షంగా జారీ చేసిన 123 జీవో ప్రకారం భూములు తీసుకోవడం అన్నాయమని రైతులు ప్రతిపక్ష నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కమ్యూనిస్టులు రైతు సంఘాలు జెఎసి నేత కోడండ రామ్ ప్రభృతులు ఈ ఆందోళనను బలపర్చారు. టిటిడిపి నేత రేవంత్ రెడ్డి నిరాహారదీక్ష తలపెట్టారు. మొదట్లో ఈ ఆందోళనను ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేసి ఎదుర్కొవాలని టిఆర్ఎస్ ప్రయత్నించింది. అందులో భాగంగా మల్లన్న సాగర్ పరిరక్షణ సమితి పేరిట సభలు ప్రదర్శనలు జరిపింది. హైదరాబాదులోనూ పెద్ద సదస్సు నిర్వహించారు. మీరు నాలుగు గ్రామాల్లో వ్యతిరేకత రెచ్చగొడితే మేము 4000 గ్రామాలను కదిలించి ఎదుర్కొంటామని హరీష్ రావు సవాల్ చేశారు. 123 కిందనే ఎక్కువ పరిహారం వస్తుందని ఆయన చేసిన వాదనను రైతు జెఎసి నాయకుడు మాజీ న్యాయమూర్తి చంద్ర కుమార్ తదితరులు తీవ్రంగా ప్రశ్నించారు. ఎట్టకేలకు హరీష్ రావు స్వరంలో మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. 123 లేదా 2013 చట్టం దేని ప్రకారమైనా రైతులు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా పరిహారం ఇస్తామని ఇప్పుడు అంటున్నారు. వారు తమ శత్రువులు కాదని భరోసా ఇస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఒక సమస్య వుంది.2013 చట్టం ప్రకారం మార్కెట్ విలువకు నాలుగు రెట్టు ఇవ్వాలి.కాని భూమి రిజిస్ట్రేషన్ రేటును ఎనిమిదేళ్ల నుంచి సవరించకపోవడంతో బాగా తక్కువగా వుండిపోయింది. ఇప్పుడున్న ప్రకారం ఇస్తే రైతులకు పెద్దగా లాభం జరగదు. ముందు రేటును సవరించి తర్వాత పరిహరం నిర్ణయిస్తే తప్ప వారు సంతృప్తి చెందరు. రేపు ఫార్మా సిటీ వగైరాల కోసం మరో 12 వేల ఎకరాలు సేకరించడం మొదలు పెడితే మళ్లీ నిరసన రావచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.
దేవుడి పేరిట యాదగిరిలో మాత్రం..
ఇందుకు భిన్నంగా యాదగిరి ఆలయ అభివృద్దికి మాత్రం ప్రభుత్వం 10 వేల ఎకరాలు సేకరించగలిగింది. అది పట్టణ ప్రాంతం కావడం, దానికి తోడు దేవుడి కోసం అన్న సెంటిమెంటు కలసి వచ్చాయని టిఆర్ఎస్ నేత ఒకరన్నారు. అక్కడ ఎకరాకు అయిదు లక్షల వరకూ పరిహారం ఇచ్చారని సమాచారం. మల్లన్నసాగర్ దగ్గర కనీసం ఎనిమిది లక్షల వరకూఇవ్వాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ఇక్కడ జరిగే పరిష్కారం రేపు మిగిలిన చోట్టకు కూడా మార్గదర్శకమవుతుంది.