తెలంగాణా న్యాయస్థానాలలో ఆంధ్రాకి చెందినవారి నియామకాలని వ్యతిరేకిస్తూ తెలంగాణా న్యాయవాదులు గత నెలరోజులుగా చేస్తున్న పోరాటం నానాటికి ఉదృతం అవుతోంది. రెండేళ్ళు అవుతున్న ఇంకా ఉమ్మడి హైకోర్టుని విభజించకపోవడం వలననే ఈ సమస్య ఉత్పన్నం అవుతోంది కనుక తక్షణమే హైకోర్టు విభజన ప్రక్రియని కూడా ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారి ఉద్యమం క్రమంగా ఉదృతమవుతున్నా కూడా ఆంధ్రా, తెలంగాణా, కేంద్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. హైకోర్టులో నిన్న జరిగిన న్యాయవాదుల సంఘం సమావేశంలో తమ డిమాండ్ల సాధనకి జూలై 1వ తేదీన హైకోర్టు విధులను బహిష్కరించాలని నిర్ణయించారు.
తెలంగాణా న్యాయవాదులు చేస్తున్న పోరాటాన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన మున్ముందు వారి పోరాటం ఇంకా ఉదృతం చేయవచ్చు. దాని వలన ప్రజలు, ప్రభుత్వాలు కూడా ఇబ్బందిపడవలసి ఉంటుంది. మిగిలిన అన్ని వ్యవస్థల మాదిరిగానే హైకోర్టు విభజన కూడా జరిగి ఉంటే అసలు ఈ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు, వాటి ముఖ్యమంత్రుల మద్య సమన్వయం లేకపోవడం, వారి మధ్య రాజకీయ విభేదాలు, ఆ కారణంగా ఇగో సమస్యలు వగైరాల వలన రెండేళ్ళు పూర్తయినా ఇంతవరకు హైకోర్టు విభజన జరుగలేదు. ఈ సమస్యని పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం కూడా చొరవ చూపడం లేదు.
హైకోర్టు విభజనకి తెలంగాణా ప్రభుత్వం మొదట్లో చాలా శ్రద్ధ చూపినా, విభజన చట్టంలో పొందుపరచపడ్డ కొన్ని నిబంధనలు అందుకు అనుమతించకపోవడంతో ఆ ప్రయత్నాలు, ఆలోచనలు కూడా మానుకొంది. తత్ఫలితంగా రెండేళ్లుగా ఈ సమస్య ఎక్కడివేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంది. సహజంగా జరుగవలసిన హైకోర్టు విభజన కోసం కూడా న్యాయవాదులు రోడ్లెక్కి పోరాడవలసి రావడం విచారకరం.
తెలంగాణా ప్రభుత్వం వారి పోరాటాన్ని పట్టించుకోనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం గమనిస్తే తన వల్ల పరిష్కారం కాని ఈ సమస్య వారి పోరాటం వలననే సాధ్యం అవుతుందనే ఉద్దేశ్యంతోనే వారి పోరాటాలని ఉపేక్షిస్తోందేమోననే సందేహం కూడా కలుగుతోంది. తెరాస ఉద్యమ పార్టీ అయినప్పటికీ ప్రస్తుతం అది అధికారంలో ఉంది కనుక ఈ సమస్యపై రోడ్లెక్కి పోరాడలేదు. అందుకే ప్రభుత్వానికి, ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నా న్యాయవాదుల పోరాటాన్ని ఉపేక్షిస్తోందేమో? ఒకవేళ ఇదే నిజమైతే ఈ సమస్య పరిష్కారానికి ఇటువంటి ఆలోచన చేయవలసి రావడం చాలా బాధాకరమే. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం మేల్కొని ఈ సమస్యని తక్షణం పరిష్కరిస్తే మంచిది.