ఒక్కొకటిగా ఊహించని పరిణామాలతో వైసీపీ ఉక్కపోత ఎదుర్కొంటోంది. ఓ వైపు కీలక నేతలను వెంటాడుతోన్న కేసులు..మరోవైపు తిరుమల లడ్డూ వివాదం మెడకు చుట్టుకోవడంతో వైసీపీ హాహాకారాలు చేస్తోంది. సుప్రీం ఆదేశాలతో ఏర్పాటు కానున్న కొత్త సిట్ ఏం తెలుస్తుందో కానీ, ఈ విషయంలో కూటమి పార్టీలు వైసీపీనీ టార్గెట్ చేయడంతో తెగ హైరానా పడుతోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేసిన వ్యాఖ్యలతోపాటు వైసీపీనీ టార్గెట్ చేయడంతో ఫ్యాన్ పార్టీ గిలగిలకొట్టుకుంటోంది. అందుకే పవన్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆ పార్టీ సీనియర్లు ఎవరూ ముందుకు రాలేదు. కేవలం జగన్ , సజ్జలే ఆలస్యంగా స్పందించారు. అదే సమయంలో కూటమిలో అన్ని పార్టీలు తిరుమల లడ్డూ వివాదంపై ఒకే వాణి వినిపించడం వైసీపీ ఇబ్బందిగా ఫీల్ అవుతోంది. పవన్ వ్యాఖ్యలను నేరుగా ఖండిస్తే సనాతన ధర్మంపై దాడి చేసినట్లు సంకేతాలు వెళ్తాయి.
అందుకే పవన్ వైసీపీపై చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా..కూటమిలో అలజడి రేపే కార్యక్రమాన్ని ముంగిట వేసుకున్నారు. సనాతన ధర్మానికి తానే చాంపియన్ అని పవన్ కళ్యాణ్ తీసుకున్న లైన్ బీజేపీ పెద్దలకు నచ్చటం లేదన్నారు సజ్జల. దీన్ని బట్టే వీరెంత కాలం కలిసుంటారో తెలియడం లేదన్నారు. కూటమి పార్టీలు అన్నీ సఖ్యతగా కనిపిస్తున్నా..సజ్జలకు మాత్రమే కొత్త కోణం కనిపించింది. ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపేందుకు సజ్జల ఈ కామెంట్స్ చేశారని కానీ, జనం వైసీపీ నేతల కామెంట్స్ ను విశ్వసించే పరిస్థితి లేదని అంటున్నారు.