”ఈ సినిమా ఫలితం ఎలాంటిదైనా నాదే బాధ్యత”
-‘స్వాగ్’ విడుదలకు ముందు శ్రీవిష్ణు ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. ఈ సినిమాపై తనకున్న నమ్మకం అది. అయితే… శ్రీవిష్ణు నమ్మకం నిజం కాలేదు. కామెడీ లేక, కథనం అర్థం కాక… ‘శ్వాగ్’ భారంగా మారిపోయింది. నిజానికి ఈ సినిమా కర్త, కర్మ, క్రియ అన్నీ శ్రీవిష్ణునే. ఈ ప్రాజెక్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ముందుకు తీసుకెళ్లింది తనే. ప్రాజెక్టుకు కావల్సిన బడ్జెట్ సెట్ చేసుకొన్నాడు. ఈ బడ్జెట్ లోనే సినిమా పూర్తి చేస్తానని ఓ ప్యాకేజీలా ఈ సినిమా మాట్లాడుకొన్నాడు. నిర్మాత విశ్వ ప్రసాద్ చేసింది కేవలం డబ్బులు పెట్టడం మాత్రమే.
కథ ఐడియాగా అనుకొన్న దగ్గర్నుంచి, అది స్క్రిప్టుగా మారి, సినిమాగా రూపాంతరం చెందినంత వరకూ అన్ని విషయాల్నీ తానే దగ్గరుండి చూసుకొన్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమాపై తను ఎంత నమ్మకం పెట్టుకొన్నాడంటే, తన పారితోషికం తగ్గించుకొని మరీ, ఆ డబ్బు మేకింగ్ పై వెచ్చించాడు. ఈ సినిమా హిట్టయితే తన రేంజ్ మారుతుందని నమ్మాడు. ఈ సినిమాతో కనీసం పది మంది సహాయ దర్శకులు, దర్శకులుగా మారతారని కలలు కన్నాడు. కానీ అవన్నీ అడియాశలు అయిపోయాయి. అయితే శ్రీవిష్ణు కష్టం మాత్రం కనిపించింది. రకరకాల గెటప్పుల్లో వైవిధ్యం చూపించాడు. ముసలి వేషం తనకు బాగా సెట్ అయ్యింది. ఆ పాత్రకు డబ్బింగ్ కోసం తెల్లవారుఝామున నాలుగు గంటలకు లేచి, డబ్బింగ్ స్టూడియోకి వెళ్లేవాడు. ఫ్రెష్ వాయిస్ తో అరగంట డబ్బింగ్ చెప్పి వచ్చేవాడు. ఇలా డబ్బింగ్ ప్రక్రియ మూడు నెలల పాటు సాగింది. సినిమా హిట్టయితే.. క్రెడిట్ కూడా తనకే ఎక్కువ దక్కేది. ఇప్పుడు ఫ్లాప్ అయ్యింది కాబట్టి, ఆ భారమూ మోయాల్సివస్తోంది. మొత్తానికి వరుస ఫ్లాపుల్లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై ఇది మరో భారం. ఈనెలలోనే ‘విశ్వం’ విడుదల అవుతోంది. మరి నిర్మాతగా విశ్వప్రసాద్ బండిని ఈ సినిమా అయినా హైవే ఎక్కిస్తుందో, లేదో చూడాలి.