(బాధితురాలి స్వగతం)
`నేను దేశరాజధాని ఢిల్లీలో ఉంటాను. పోలీసులు వల్ల నాకు జరిగిన అవమానం అంతాఇంతాకాదు. ఒక అపరిచితుడు పట్టపగలు, రద్దీగా ఉండే సెంటర్ లో ఆడపిల్లనైన నన్ను ముద్దుపెట్టుకోబోయాడు. ఆ విషయం పోలీసులకు చెబ్తే వారిచ్చిన సమాధానంతో నేను మరింత షాకయ్యాను. కిస్సింగ్ వేధింపుకానేకాదట ! స్త్రీకి ఎలాంటి రక్షణ ఈ రక్షకభటుల నుంచి కలుగుతుందో మీ అందరికీ తెలియజెప్పడానికే నా స్నేహితురాలిని ఈ సంఘటనపై ఫేస్ బుక్ లో పోస్ట్ చేయమన్నాను. బలవంతపు కిస్ ఉదంతం ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగానే వైరల్ గా స్ప్రెడ్ అయింది. కేవలం 8గంటల్లో 5,400 మంది ఈ పోస్ట్ ని షేర్ చేశారు. కనీసం నాకింతమంది మద్దతు ఉన్నందుకు ఆనందంగాఉంది. అయితే, ఆరోజు నాకు జరిగిన పరాభవాన్నిమాత్రం నేను మరచిపోలేకున్నాను. మన పోలీస్ వ్యవస్థ ఎంతగా భ్రష్టుపట్టిందో, అవినీతి చెదలు ఎంతగా వ్యవస్థను చిధ్రంచేస్తున్నాయో ఈ సంఘటనతో అర్థమవుతుంది. అందుకే అసలేం జరిగిందో వివరంగా మీకు చెబుతున్నాను.
ఆరోజు… ఢిల్లీలోని బార్కంబా ట్రాఫిక్ లైట్ దగ్గరున్న అతిపెద్ద వ్యాపారకూడలి కనాట్ ప్లేస్ వద్ద పనిమీద వెళుతున్నాను. అంతలో ఒక అపరిచితుడు హఠాత్తుగా నన్ను పట్టుకుని ముద్దుపెట్టుకోబోయాడు. అతని బలవంతపు వికృతచేష్టని ఒకపక్క అడ్డుకుంటూనే మరోవైపు పోలీసులకు కాల్ చేశాను. అదే నేను చేసిన తప్పని తర్వాత తెలిసింది. ఈలోగా జనమంతా అక్కడ గుమిగూడారు. 40నిమిషాల తర్వాత పోలీసులు ఎంటరయ్యారు. వారు రాగానే ముందుగా చేసిన పనేమిటో తెలుసా ? అపరిచత వ్యక్తిని పక్కకు తీసుకెళ్లడం! అతగాడ్ని పక్కకు తీసుకెళ్లారు. అతనొచ్చిన వ్యాన్ లో వీళ్లుకూడా ఎక్కి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. అంతే, పోలీసులు బాధితురాలి పక్షంవైపు నిలబడకుండా అపరిచితుడి పక్షంవైపు నిలిచారు. పైగా నేనేదో తప్పుచేసినట్టు నన్నే వేధింపులకు గురిచేయడం ఆశ్చర్యమేసింది.
అంతలో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి – `అమ్మాయిని కిస్ చేయాలనుకోవడం తప్పేమీకాదు, అది వేధింపు అంతకంటేకాదు ‘ అంటూ అడ్డంగా వాదించడం మొదలెట్టాడు. ఇదంతా చూస్తుంటే అపరిచితుడు బాధితుడిలాగా, నేను నేరస్థురాలిగా వాళ్లు చిత్రీకరిస్తున్నట్టు అనిపించింది. గుమిగూడిన జనం మందు నేనో దోషిగా నిలబడాల్సివచ్చింది.
ఈ విషయమంతా నా ఫ్రెండ్ కు చెప్పాను. ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడది వైరల్ గా వ్యాపిస్తోంది. పట్టపగలే మహిళలకు స్వేచ్ఛలేకపోతే, ఇక నైట్ డ్యూటీలకు తమ పిల్లల్ని పెద్దలు ఎలా పంపించగలరు? పైగా, నా స్నేహితురాలు పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేయబోతే, మూడుసార్లు వారించాడు అక్కడి పోలీస్ అధికారు. పైగా, అలా చేస్తే బాధితురాలేకాకుండా, ఆమె తల్లిదండ్రులు కూడా కోర్టుకు రావాల్సిఉంటుందని భయపెట్టాడట. తప్పుచేసినవ్యక్తి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ లేదా కోర్టుకు పిలవనక్కర్లేదా అని నా స్నేహితురాలు ప్రశ్నిస్తే, `ఆ అవసరంలేదు’ అంటూ తేల్చిపారేశాడు ఆ పోలీస్ అధికారి. పైగా బాధితురాలి ఫోన్ నెంబర్ తీసుకుని అపరిచితుడి తల్లిదండ్రులకు పంపడంమరో విడ్డూరం. దీంతో అతగాడి తల్లిదండ్రులు ఆ రాత్రి ఫోన్ చేశారు. దీంతో నాలో భయాందోళనలు పెరిగాయి.
చివరిగా ఒక్క విషయం… వ్యాన్ లో వారిద్దరూ (అపరిచితుడు, పోలీస్) ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు వివరంగా మీకు చెప్పనక్కర్లేదనుకుంటా. పోలీస్ వ్యవస్థలో ఇలాంటి అవినీతి పురుగుల్ని ఏరిపారేయాలి. రక్షకభటులే భక్షకభటులైతే, తాడే పామైతే ఇక ఎవర్ని నమ్మగలం? అందుకే నాయీ అనుభవం మీలో చైతన్యం కలిగిస్తే అదేనాకు చాలు’
– మీ ఢిల్లీ సోదరి
(ఢిల్లీలో జరిగిన యదార్థ సంఘటనకు ఇది స్పందనగా…)
– కణ్వస