‘దూకుడు’ సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయిన శ్రీనువైట్లకు అక్కడ్నుంచి డౌన్ ఫాల్ మొదలైంది. ‘బాద్ షా’ యావరేజ్ మార్కులు తెచ్చుకొంది. అయితే ఆ తరవాత వచ్చిన ‘ఆగడు’ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అక్కడ్నుంచి శ్రీనువైట్ల కోలుకోలేకపోయాడు. రామ్ చరణ్ తో శ్రీనువైట్ల తీసిన బ్రూస్లీ కూడా ఫ్లాపుల లిస్టులో చేరిపోయింది. కానీ ఈ సినిమాని ఇప్పుడు ఫ్లాప్ అంటే ఒప్పుకోవడం లేదు శ్రీనువైట్ల. ”బ్రూస్లీ బడ్జెట్ తో పోలిస్తే… వచ్చిన రెవిన్యూ ఎక్కువ. నిర్మాతలు అన్ని విధాలా లాభాలు తెచ్చుకొన్నారు. అందులో చాలా సీన్లు బాగా పండాయి. ముఖ్యంగా మెగాస్టార్ రీ ఎంట్రీలా ఈ సినిమా ఉపయోగపడింది. చివర్లో చిరు ఎంట్రీకి మంచి అప్లాప్ వచ్చింది. కానీ మేం ఆశించిన స్థాయిలో సినిమా ఆడలేదు. అలాగని ఈ సినిమా ఫ్లాప్ సినిమా కాదు” అంటూ వివరణ ఇచ్చుకొన్నాడు శ్రీనువైట్ల.
తాజాగా శ్రీనువైట్ల ఇచ్చిన స్టేట్మెంట్ తో మెగా ఫ్యాన్స్ కూడా పాత లెక్కలు బయటకు తీస్తున్నారు. ‘బ్రూస్లీ’ ఓపెనింగ్స్ అప్పటి హిట్ సినిమాల కలక్షన్ల రేంజ్లోనే ఉన్నాయని, మరీ అంత తీసి పారేయాల్సిన సినిమా కాదని సంతృప్తి పడుతున్నారు. శ్రీనువైట్ల సినిమాల్లో ఉండే మినిమం కామెడీ ఆ రోజుల్లో బ్రూస్లీలో లేకుండా పోయింది. ఇది అప్పటి రివ్యూలే తేల్చాయి. చిరు ఎంట్రీ సీన్, దాని కోసం తమన్ ఇచ్చిన ఆర్.ఆర్… ఫ్యాన్స్ కి నచ్చాయి. చిరు ఎంట్రీ కూడా బలవంతంగా ఇరికించినట్టే ఉంటుంది. కాకపోతే చాలా కాలం తరవాత చిరంజీవిని ఆ లుక్ లో చూసేసరికి మెగా ఫ్యాన్స్ సంతృప్తి పడ్డారు. చిరు ఎంట్రీ కోసం థియేటర్లకు వెళ్లినవాళ్లు ఉన్నారు. అదే లేకపోతే… కచ్చితంగా ‘బ్రూస్లీ’కి ఆ మాత్రం వసూళ్లు వచ్చేవి కావన్నది నిజం. ‘కాలక్రమంలో ఫ్లాపులు కూడా క్లాసిక్కులుగా మారిపోతాయ్’ అని ఓ సందర్భంలో త్రివిక్రమ్ అన్నమాటలు గుర్తొస్తున్నాయి. కొంతకాలం పోతే.. ‘బ్రూస్లీ’ని క్లాసిక్ అనేసినా అనేస్తారు.